తుది తీర్పు మేరకే గురుకుల లెక్చరర్ల నియామకాలు – హైకోర్టు

BIKKI NEWS (MARCH 13) : తెలంగాణ గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్‌ లెక్చరర్ల పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడే ఉంటుందని (gurukula lecturer posts recruitment as for high court orders) హైకోర్టు స్పష్టం చేసింది.

గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్‌ లెక్చరర్ల భర్తీ కోసం గత సంవత్సరం ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిబంధనలు పాటించకుండా తమను పక్కకు పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై న్యాయ మూర్తి జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది చిల్లా రమేశ్‌ వాదనలు వినిపిస్తూ.. ‘జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఎంఎస్సీలో ఏ సబ్జెక్ట్‌ చేసి నా డిగ్రీలో మాత్రం సంబంధిత సబ్జెక్ట్‌ చేసి ఉండాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్ష శాస్త్రం చదివి.. ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్‌ చదివిన పిటిషనర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్‌ లిస్ట్‌లో పిటిషనర్ల పేర్లు కూడా ఉన్నాయి. సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత పిటిషనర్ల అర్హతపై నిపుణుల కమిటీ వేశామని.. నివేదిక వచ్చేదాకా ఆగాలని అధికారులు సూచించారు. అయితే ఆ నివేదిక రాకముందే పిటిషనర్లను పక్కకుపెట్టి ఇతరులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదు.

మెరిట్‌ ప్రకారం పిటిషనర్లకు కూడా అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.