జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపు నిర్ణయంపై హర్షం

ఫిబ్రవరి 1 నుండి భౌతిక తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత 6, 7 సంవత్సరాలుగా సేవలందిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1500 మంది గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తూ ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ గారు అన్ని జిల్లాల ఇంటర్మీడియట్ అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడం పై గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ మరియు నాయకులు ఎం.డీ మోహిత్ పాషా, బాబురావు, కే మహేష్ కుమార్, ఎస్ వెంకటేష్ లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో భాస్కర్ మాట్లాడుతూ..కరోనా విపత్కర పరిస్థితులలో..ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటూ దాదాపు సంవత్సరం పాటూ ఎలాంటి ఉపాధి, వేతనాలు లేక గెస్ట్ లెక్చరర్లను రెన్యూవల్ చేయాలని పలుమార్లు చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని కొనసాగించడం చాలా హర్షనీయమని, అదేవిధంగా కొనసాగింపుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలన్నారు.

పస్టియర్ ఒకరోజు, సెకండియర్ ఒకరోజు తరగతులు నిర్నహించడం వల్ల గెస్ట్ లెక్చరర్లకు పీరియడ్స్ కు సంబందించిన విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని కావున ఈ విద్యాసంవత్సరం పీరియడ్స్ తో ఎలాంటి సంబందం లేకుండా నెలవారీగా వేతనాలు ఇవ్వాలన్నారు. ఇదే క్రమంలో ఇటీవల జరిగిన ప్రిన్సిపాల్ పదోన్నతుల వల్ల మరియు ఇతర కారణాల ద్వారా ఏర్పడ్డ ఖాళీలలో రిటైర్డ్ ఉద్యోగులు కాకుండా గతంలో గవర్నమెంట్ కాలేజీలలో సేవలందించి డీపీసీ ప్రమోషన్ల కారణంగా డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్లకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు.

అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నం. 45 ప్రకారం ఇతర తాత్కాలిక ఉద్యోగుల మాదిరిగా మానవతా ధృక్పథంతో ఈ విద్యాసంవత్సరం జూన్ 1 నుండే జీతాలను చెల్లించి గెస్ట్ లెక్చరర్లను ఆదుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా గెస్ట్ లెక్చరర్లను కొనసాగిస్తూ..నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, రెన్యూవల్ అంశాన్ని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us@