ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగించాలి

  • పెండింగ్ వేతనాలను త్వరగా విడుదలయ్యేలా చూడాలి
  • గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్
  • ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు వినతి పత్రం అందజేత

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1658 మంది గెస్ట్ లెక్చరర్లను ఈ విద్యాసంవత్సరం ఆన్లైన్ తరగతులలో కొనసాగించాలని, పెండింగ్ వేతనాలను సత్వరమే మంజూరయ్యేలా చూడాలని మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చిన ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను స్థానిక కలెక్టర్ విశ్రాంతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గెస్ట్ లెక్చరర్ల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ అందజేశారు.

ఈ సందర్బంగా గెస్ట్ లెక్చరర్ల సమస్యలను తెలుపుతూ..ఈ క్రమంలో గత విద్యాసంవత్సరం కరోనా వైరస్ తీవ్రంగా విస్తరించిన పరిస్థితులలో సెప్టెంబర్ నెలలో ఆన్ లైన్ తరగతులు ప్రారంభం అయినప్పటినుండే అన్ని కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లు సేవలను అందించారు. కానీ అధికారికంగా కొనసాగించలేదు..ఆ తర్వాత ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన 1 ఫిబ్రవరి 2021 నుండి విద్యాసంవత్సరం చివరి పని దినం వరకు పాత గెస్ట్ లెక్చరర్లను కొనసాగించడం జరిగిందని తెలిపారు.

కరోనా.. సెకండ్ వేవ్ కారణంగా ఈ విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడమే గాక, ప్రత్యక్ష తరగతులకు బదులు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మా గెస్ట్ లెక్చరర్లను మినహాయించి ఇతర లెక్చరర్లను (రెగ్యూలర్, కాంట్రాక్టు, ఎంటీఎస్, పార్టీ టైం హవర్లీ) కళాశాలకు హాజరు కావాలని ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశించారు. గత సంవత్సరం ప్రత్యక్ష తరగతులు ఆపేసిన క్రమంలో దాదాపు నెలకు పైగా ఆన్లైన్ తరగతులలో మా సేవలను కూడా ఉపయోగించుకున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు మేము భోదిస్తున్న సబ్జెక్టులలో సరైన న్యాయం జరగాలంటే గత 6, 7 సం,, ల నుండి కళాశాలల్లో సేవలందిస్తున్న పాత గెస్ట్ లెక్చరర్లను యధావిధిగా కొనసాగించి.. ఈ కరోనా విపత్కర పరిస్థితులలో గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం ఆన్లైన్ తరగతులలో గెస్ట్ లెక్చరర్లు అందుబాటులో లేక వారు బోధించే సబ్జెక్టుల విషయంలో విద్యార్థులకు పర్యవేక్షణ, సందేహాల నివృత్తి చేసేవారు లేక, ప్రత్యేకంగా వారిపై వ్యక్తిగత శ్రధ్ధ వహించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ప్రస్తుతం కళాశాలల్లో అడ్మిషన్ డ్రైవ్ ముమ్మరంగా నడుస్తుండడంతో..పూర్తిగా గెస్ట్ లెక్చరర్లు బోధిస్తున్న గ్రూపులలో అడ్మిషన్లు చేసే వారు లేక తక్కువగా అడ్మిషన్లు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో తర్వాత మమ్మల్ని కోనసాగించినా కూడా.. గెస్ట్ లెక్చరర్లు బోధించే గ్రూపులలో సంఖ్య తక్కువగా ఉందనే కారణం చూపుతూ.. లెక్చరర్లకు మరియు ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.. కావున తక్షణమే పాత గెస్ట్ లెక్టరర్లను యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ లింగంపల్లి దయానంద్ తదితరులు పాల్గొన్నారు.