సిద్దిపేట (నవంబర్ – 13) : తెలంగాణలో గ్రూప్ – 4 ఉద్యోగాలకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూలులో పోలీసు శిక్షణ పొందుతున్న 300 మంది అభ్యర్థులకు మంత్రి హరీశ్ రావు సొంత ఖర్చుతో పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు అభ్యర్థులు తపనతో సన్నద్ధం కావాలి. పోలీసు కొలువు చేజిక్కించుకునేందుకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. శ్రమించి కొలువు సాధించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుందని, వాటిలో 17 వేల పోలీసు ఉద్యోగాలన్నారు. మంత్రి హరీశ్ రావు చొరవతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలోని నాలుగు పట్టణాల్లో దేహదారుఢ్య శిక్షణ శిబిర తరగతుల కసరత్తులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.