గ్రూప్ -1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో ఎంపిక

  • 503 పోస్టులకు 25 వేలమంది ఎంపిక
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాతే స్థానికత వర్తింపు

త్వరలో జారీ కానున్న గ్రూప్1 నోటిఫికేషన్ ప్రక్రియలో మెయిన్స్ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని TSPSC నిర్ణయించింది. 503 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున దాదాపు 25 వేల మందిని మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు.

గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ సన్నాహాలు చేస్తున్నది. దరఖాస్తు చేసుకొన్నవారందరికీ ప్రిలిమ్స్ పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. అందులో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారి నుంచి మెయిన్స్ కు ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపికచేసేందుకు నిర్ధిష్ట కటాఫ్ మార్కులను నిర్ణయిస్తారు.

★ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాతే స్థానికత :

అభ్యర్థుల విద్యార్హతలు, సర్టిఫికెట్ వెరిఫికేషను మెయిన్స్ తర్వాత నిర్వహించాలా? ప్రిలిమ్స్ తర్వాత నిర్వహించాలా? అన్న అంశంపై కమిషన్ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. గతంలో మెయిన్స్ ఫలితాల తర్వాతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి ఇంటర్వ్యూలకు ఎంపిక చేసేవారు. తాజాగా ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల స్థానికతను కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలోనే తేల్చాలని భావిస్తున్నారు. కొత్త జోనల్ విధానంతో చాలామంది స్థానికత మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక దశలో స్థానికత జోలికి వెళ్లకుండా సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో దానిని తేల్చటం వల్ల తక్కువ సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చని కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా, గ్రూప్ 1 పరీక్షను ఈసారి ఉర్దూ లోనూ నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. ఆప్షన్ అడిగినవారికి ఇంగ్లిష్ పాటు తెలుగుకు బదులుగా ఉర్దూలో ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు.

Follow Us @