Gandhi – జనుల హృదయాలలో నిలిచిన నేత జాతిపిత – అడ్డగూడి ఉమాదేవి

  • Mahatma Gandhi Ji Birth Anniversary Day October 2nd

BIKKI NEWS (OCTOBER – 02) : Gandhi Jayanthi Special essay by A Umadevi. అహింసా వాదిగా, హరిజనోద్ధారకుడిగా, శాంతియుత మార్గంలో స్వరాజ్యాన్ని సంపాదించి ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్ట స్థానాన్ని పొందిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1969 అక్టోబర్ 2న పోరుబందర్ లో నిజాయితీ, దైవభక్తి గల వైశ్య కుటుంబంలో జన్మించాడు.

Gandhi Jayanthi Special essay by A Umadevi.

1891 నాటికి ఇంగ్లాండ్ లో బార్ ఎట్ లా పట్టా పొంది యువ న్యాయవాదిగా స్వదేశం తిరిగి వచ్చిన గాంధీకి ఆవృత్తి సఫలతనీయలేదు. దానితో దక్షిణాఫ్రీకాలోని నేటాల్ కి వెళ్ళాడు. అక్కడ జాతి వివక్ష విధానాలను ఎదుర్కోవడానికి సత్యా అహింసలను ఆయుధముగా సత్యాగ్రహాన్ని చేపట్టినాడు. 1893—1914 మధ్య కాలంలో గాంధీ నడిపిన అహింసా పోరాటాలు, సాధించిన విజయాలు మాతృదేశ విముక్తి ఉద్యమాలకు మార్గదర్శకంగా నిలిచాయి. ముఖ్యంగా మహాత్మాగాంధిని ప్రభావితం చేసినవి “భగవద్గీత”, టాల్ స్టాయ్ రచన “ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు” మరియు జాన్ రస్కిన్ రాసిన “అన్టూది లాస్ట్.”

గాంధీ నిర్వహించిన తొలిమూడు సత్యాగ్రహాలు 1) చంపారన్ సత్యాగ్రహం, 2) ఖేడా జిల్లా రైతుల సత్యాగ్రహం, 3) అహమదాబాద్ బట్టల మిల్లు కార్మికుల సమస్య.

చంపారన్ నీలిమందు రైతుల ఉద్యమంలో భాగంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకముగా రైతుల తిరుగుబాటు విజయవంతమైంది. గాంధీ ప్రార్థనను మన్నించి ప్రభుత్వం కమిటీ రూపొందించగా గాంధీ అహింసా సిద్ధాంతం ఫలించింది.

గాంధీ నిర్వహించిన రెండో ఉద్యమం గుజరాత్ లోని ఖేడా రైతులకు సంబంధించినది మార్చి 22 – 1918 లో రైతుల సమస్యను పరిష్కరించడానికి శాంతియుత పోరాటాన్ని ఆరంభించి భూమి శిస్తు తగ్గించడంలో విజయుడైనాడు.

1917లో మిల్లు యజమానులకూ కార్మికులకు మధ్య రాజీ కుదుర్చుటకై ఆమరణ నిరాహార దీక్షను మార్చి 15/1918లో ప్రారంభించగా యజమానులు కార్మికులకు 35%జీతాన్ని పెంచగా సమస్య పరిష్కరించబడింది.

చంపారన్, ఖేడా సత్యాగ్రహాలలో గాంధీజీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ కుడి భుజంగా నిలువగా ప్రజలు గాంధీని “బాపు”, “మహాత్ముడు” అని పిలిచారు.

పై మూడు సంఘటనలు భవిష్యత్ కార్యాచరణకు పునాదులు వేసినాయి. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ లోని అమృతసర్ జలియన్ వాలాబాగ్ లో సామాన్యులపై జరిపిన మారణకాండలో 400మంది భారతీయులు మరణించారు భారతదేశానికి “సంపూర్ణ స్వరాజ్యం” సాధించాలనే సంకల్పం గాంధీలో ప్రబలమై 1921లో భారత జాతీయ కాంగ్రెస్ ను పునర్వ్యవస్థీకరించి తన ధ్యేయం సంపూర్ణస్వరాజ్యం అని ప్రకటిస్తూ తన పోరాటంలో ముఖ్యమైన అంశాలుగా విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, సమాజ దురాచార నిర్మూలన జోడించాడు.

1922 సహాయ నిరాకరణోద్యమం లో భాగంగా 2 సం॥రాలు జైల్లో గడిపుతున్న కాలంలో కాంగ్రెస్ అతివాద, మితవాద వర్గాలలో భేదాలు తలెత్తాయి. 1924లో మద్యపానం, అంటరానితనం, నిరక్షరాస్యత నిర్మూలనా ఉద్యమంలో లీనమై మూడు వారాలు నిరాహారదీక్ష చేపట్టాడు.

1927లో సైమన్ కి వ్యతిరేకముగా పోరాడాడు. 1928ల్ కలకత్తా కాంగ్రెస్ స్వతంత్ర ప్రతిపత్తి తీర్మాణాన్ని ఆమోదింపజేసినా ఆశించిన ఫలితం రాలేదు.

1929లో డిసెంబర్ 31 లాహోర్ లో భారత స్వతంత్ర్య పతాకం ఎగురవేసి 1930ని జనవరి 26న స్వతంత్ర్య దినంగా ప్రకటించాడు.

1930 లో ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేపట్టి అహమదాబాద్ నుండి దండి వరకు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు.

1931లో ప్రభుత్వం ఇర్విన్ ఒప్పందం ప్రకారం ఉద్యమాన్ని ఆపారు.

1933 మే 8 న నిమ్న కులాలవారిని “హరిజనులు”అని పిలుస్తూ వారి స్థితిగతులు మార్చుటకై నిరాహార దీక్ష చేపట్టగా 1934 లో అతనిపై మూడు సార్లు హత్యాప్రయత్నం జరిగింది.

1938లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాస్ తో భేదాలు ఏర్పడ్డాయి. పార్లమెంటునుండి కాంగ్రెస్ వారంతా రాజీనామ చేసారు. బ్రిటీష్ వారు భారత్ ని వదిలి వెళ్ళాలంటూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీవ్రంగా చేస్తూ “భారత్ ఛోడో “కరోయా మరో”శఅంటూ పోరాడారు. 1942 ఆగస్టు 9న గాంధీతో పాటు కాంగ్రెస్ కార్యవర్గం అరెస్టయింది. 18 నెలల కారాగారం తర్వాత అతని ఆరోగ్యం క్షీణించగా 1944లో విడుదల చేయగా క్రమంగా స్వాతంత్ర్యం ఇస్తామని అంగీకరించారు. గత్యంతరం లేక దేశ విభజన అనంతరం 1947 ఆగస్టు 15 న స్వతంత్ర భారతజెండా ఎగురవేయబడింది.

1919 నుండి 1947 వరకు అనేక సమస్యల్ని పరిష్కరించుకుంటూ అహింసావాదిగా శాంతియుత మార్గంలో స్వరాజ్యాన్ని సంపాదించి జాతి గర్వంచదగ్గ నేతగా నిలిచిన మహాత్ముడు కోట్ల భారతీయ గుండెలలో అమరుడైనాడు.

వ్యాసకర్త :
అడ్డగూడి ఉమాదేవి
తెలుగు అధ్యాపకురాలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు