BIKKI NEWS (JULY 18) : Farm loan waiver successfully completed – CM revanth reddy. వ్యవసాయాన్ని పండుగలా మార్చి, రైతులను రారాజుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ఆ క్రమంలో రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయడం ఓ చరిత్రాత్మక విజయమని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అన్నారు.
Farm loan waiver successfully completed – CM Revanth Reddy
డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రైతు రుణమాఫీ, తర్వాత మళ్లీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం.. రైతు సంక్షేమ విధానాల్లో ఓ గొప్ప కార్యక్రమంగా, యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం ఉద్ఘాటించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలు మాటలు చెప్పే అలవాటు గాంధీ కుటుంబానికి లేదని, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది శిలాశాసనం లాంటిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలోనైనా, ఆరు గ్యారంటీల అమలు విషయంలోనైనా, నేటి రైతు రుణమాఫీ విషయంలోనైనా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని ముఖ్యమంత్రి తెలిపారు.
రైతు రుణమాఫీ తొలివిడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రిగారు సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 577 రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వేలాదిమంది రైతులను ఉద్దేశించి మాట్లాడారు.
రూ.1లక్ష లోపు అప్పులున్న రైతులు ఈరోజుతో రుణ విముక్తులయ్యారని, జులై చివరిలోగా రూ.1.5లక్షల రుణాలున్నవారు, ఆ తర్వాత రూ.2లక్షల రుణాలున్నవారి ఖాతాల్లోనూ డబ్బులు వేసి ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెల్లోనే ప్రజలకు రూ.29వేల కోట్ల విలువైన సంక్షేమాన్ని అందించామని సీఎం తెలిపారు.
అనంతరం పలువురు రైతులకు రుణమాఫీ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు శ్రీ కె కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ జూపల్లి కృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.