యాదాద్రి భువనగిరి (జూలై – 07) : పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో (Falaknuma Express fire accident) భారీ అగ్నిప్రమాదం జరిగింది ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు చైన్ లాగడంతో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు. దీంతో భారీ ప్రాణనష్టం తప్పింది.
అయితే మంటలను ఆర్పే సిబ్బంది వచ్చేలోపే క్రమంగా మిగతా బోగీలకు నిప్పంటుకుంది. దీంతో ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఏడు బోగీలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సికింద్రాబాద్ నుంచి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. బోగీల లింకు తొలగించి మిగతా బోగీలకు నిప్పంటుకోకుండా చేశారు.