సర్టిఫికెట్ లపై తప్పుడు ప్రచారం తగదు:సీహెచ్ కనకచంద్రం

  • చాలా వరకు రెగ్యులర్ లెక్చరర్లవి అవే సర్టిఫికెట్లు…
  • కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ ను జీర్ణించుకోలేని కొన్ని దుష్టశక్తుల ప్రచారం.

కాంట్రాక్ట్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ విషయంలో సర్టిఫికెట్ లపై తప్పుడు సమాచారాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించి గుర్తింపులేని యూనివర్సిటీ సర్టిఫికెట్లు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘాల జేఏసీ చైర్మన్ కనక చంద్రం అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జేఏసీ కో చైర్మన్ డాక్టర్ శ్రద్ధానందం, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి నంట శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఆయన మాట్లాడారు.

రెగ్యులర్ లెక్చరర్లలో సైతం చాలా మంది ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అంత మాత్రాన వారివి దొంగ సర్టిఫికెట్లు గా పరిగణించాలా అని ఆయన ప్రశ్నించారు. కేవలం కొంతమంది కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు తప్పుడు సమాచారాన్ని మీడియాకు అందిస్తున్నారని ఆరోపించారు. అధికారికంగా వెలువడిన సమాచారాన్ని మాత్రమే ప్రచారం చేయాలని మీడియా మిత్రులకు సూచించారు. కొంతమంది మెప్పు కోసం అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజల్లో పలుచన కావద్దని హితువు పలికారు.

రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు లెక్చరర్లు గా సేవలందించిన తమ పట్ల ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని రెగ్యులరైజ్ చేస్తుంటే తప్పుడు వార్తలను ప్రచారం చేయడం సరికాదని వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు.

సర్టిఫికెట్ ల గుర్తింపు విషయంలో అధికారుల అవగాహన లోపం మూలంగా గుర్తింపు ఉన్న యూనివర్సిటీలను గుర్తింపు లేనివిగా సృష్టించారన్నారు. అవే యూనివర్సిటీ సర్టిఫికెట్లతో ప్రస్తుతం రెగ్యులర్ లెక్చరర్లుగా, ప్రిన్సిపాల్స్ గా ఎంతోమంది పనిచేస్తున్నారని, గ్రూప్ 4లో ఉద్యోగం పొంది గ్రూప్ వన్ పోస్ట్ అయిన లెక్చరర్ గా పదోన్నతి పొందిన వారు సైతం ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లను కలిగిన వారేనని చెప్పారు. శ్రీ రామానంద తీర్థ, బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడ, వినాయక మిషన్, కువ్వేంపు తదితర గుర్తింపు ఉన్న యూనివర్సిటీలను గుర్తింపు లేని యూనివర్సిటీలుగా చూపిన విషయంలో ఇంటర్ కమిషనరేట్ అధికారులను సంప్రదించగా వారు పొరపాటు జరిగిందని, తక్షణమే సరిచేసి తిరిగి వెబ్సైట్లో జాబితాలను పొందుపరుస్తామని చెప్పారన్నారు.

Follow Us @