ఇంటర్ విలీనం – ఇబ్బందులు అనేకం.

తెలంగాణ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం ప్రతిపాదనలు అమలు పరచడంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్ క్లాసులు ప్రారంభించుటకు చేస్తున్న ప్రయత్నాలను పునరాలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పలు సమస్యలతో సతమతమవుతున్న పాఠశాల విద్యలో ఇంటర్ విద్యను చేర్చడం పలు వివాదలకు దారితీస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా దేశంలోనే ఉన్నత ప్రమాణాలతో ఇంటర్ విద్యను అందిస్తున్న తెలుగు రాష్ట్రాలలొ ఒకటైనా తెలంగాణ ప్రభుత్వం అభాసుపాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

● ఇంటర్ విద్యకు అంకురార్పణ చేసిన పీవీ.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీ నరసింహారావు 1969లో ఇంటర్ విద్యకు అంకురార్పణ చేశారు. ఇంటర్విద్య ఆయన మానస పుత్రిక. దేశంలోని తెలుగు రాష్ట్రాలలో తప్ప ఏ ఇతర రాష్ట్రాలలో ఇంటర్ విద్యా మండలి లేదు. అందువలన తెలుగు రాష్ట్రాలలో పాఠశాల విద్యకు, ఉన్నత కళాశాల విద్యకు అనుసంధానంగా ఇంటర్ విద్య మారి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది.

● తెలంగాణలో ఉన్నత ప్రమాణాలతో ఇంటర్విద్య


ఉమ్మడి రాష్ట్రంలో ఇంటర్ విద్యా మండలి అనేక సమస్యలతో సతమతమవుతూ ఉండేది. కానీ 2014లొ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టి బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన ఇంటర్ విద్యను అందించుటకు అనేక చర్యలను చేపట్టింది. వీటిలో భాగంగా ఉచిత ఇంటర్ ప్రవేశాలు, ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అన్ని కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు దోహదపడింది. దీంతో ఇంటర్ విద్యా మండలి ఉన్నత ప్రమాణాలతో ఇంటర్ విద్యను అందించడం వలన అనేక మంది విద్యార్థులు ఐఐటీ, నీట్, జేఈఈ, ఎంసెట్, క్లాట్ వంటి పలు పోటీ పరీక్షలలో ఉత్తమ ప్రతిభను కనబరిచి అత్యధిక సీట్లను సాధించారు అనడంలో అతిశయోక్తి లేదు. అదే విధంగా ఇంటర్ బోర్డు ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ఇంటర్ విద్యను అందించడం వల్లనే దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మన రాజధానిలోని పలు కళాశాలల్లో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒకవైపు కార్పోరేట్ వ్యవస్థకు చరమగీతం పాడుతూ మరోవైపు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. దీంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు కూడా జాతీయ అత్యున్నత సంస్థల్లో ప్రవేశాలను పొందుతున్నారు. 50 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ఇంటర్ విద్యను కెసిఆర్ ఆరేళ్ల పాలనలో అనేక చర్యలు చేపట్టి ఇంటర్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే దశలోనే పాఠశాల విద్యలో కలపడం అనేది సరైన చర్య కాదని చెప్పవచ్చు.

ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయడం వలన అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. అవి


★ ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేటు, కార్పొరేటు జూనియర్ కళాశాలలు విద్య మాఫియాగా తయారై బడుగు బలహీన వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడం జరుగుతుంది.
★ మన రాష్ట్రంలో ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తే, మన పిల్లలు ఇంటర్ విద్య కోసం పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు వలస వెళ్లి చదువుకోవడం జరుగుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక ఆదాయంకు గండికొడుతుంది.


★ ప్రస్తుత ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు విద్యార్థుల కొరత ఏర్పడి, ప్రవేశాలు తగ్గి మూతపడతాయి .


★ ఏళ్ల తరబడి ఇంటర్ విద్య లో పని చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు పాఠశాల విద్యకు వెళ్ళవచ్చు. కానీ ఇదే వ్యవస్థను నమ్ముకొని బతుకుతున్న ఒప్పంద అధ్యాపకులు, అతిథి అధ్యాపకులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి ఉపాధి లభించదు.


★ అదే విధంగా గ్రామీణ, పట్టణ ప్రైవేటు జూనియర్ కళాశాలలు కూడా మూతబడి నిరుద్యోగం పెరిగే అవకాశం కలదు.


★ ఇప్పటి వరకు ఇంటర్ విద్యార్హతతో జరిగిన పలు జాతీయ పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పలు సంస్థల్లో సీట్లను సాధించినారు. కానీ పాఠశాల విద్యలో విలీనం చేస్తే జాతీయ పరీక్షల్లో మన విద్యార్థులు వెనుకబడే అవకాశం అధికంగా కలదు.

పై విధమైన సమస్యలతో పాటు ఇంకా అనేక సమస్యలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేసే ఆలోచనను విరమించుకోవాలని మేధావులు, విద్యావేత్తలు మరియు తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనే మరింత నాణ్యమైన ఇంటర్ విద్యను అందించుటకు ప్రభుత్వం తన కృషిని మరింత మెరుగుపరుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పీవీ నర్సింహారావు మానస పుత్రిక అయినా ఇంటర్విద్యను ఆయన శతజయంత్యుత్సవాల సందర్భంగా పాఠశాల విద్యలో విలీన ప్రక్రియను నిలిపివేయడమే పీవీ నరసింహారావుకు నిజమైన నివాళి.

వ్యాసకర్త ::

పోతరవేని తిరుపతి, ప్రధాన కార్యదర్శి

తెలంగాణ జూనియర్ లెక్చరర్ ల సంఘం, జగిత్యాల

9963117456

Follow Us @