ఆసిఫాబాద్ (జూలై – 20): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా నోడల్ కార్యాలయం యందు బుధవారం రోజున చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఇంటర్ HEC కోర్సులో అడ్మిషన్స్ పెంచుటకు రూపొందించిన వాల్ పోస్టరును జిల్లా నోడల్ అధికారి డా. శ్రీధర్ సుమన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఇంటర్ విద్యాధికారి గారు మాట్లాడుతూ చరిత్ర బోధన అన్ని జూనియర్ కళాశాలల్లో ప్రవేశ పెట్టడానికి కృషి చేయాలని అన్నారు. చరిత్ర ఒక అధ్యయన అంశంగా పోటీ పరీక్షల్లో రాణించేలా విద్యార్థులకు తగు తర్ఫీదు నివ్వడానికి పరిరక్షణ సమితి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ విద్యాబోధనలో చరిత్ర సబ్జెక్టుకు ప్రాధాన్యత ఇవ్వడం వలన విద్యార్థులలో మానవీయ, నైతిక విలువలు పెంపొందడంతో పాటు పోటీ పరీక్షల కోసం తర్ఫీదు పొందుతారు అన్నారు. ఇంటర్ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న చరిత్ర జూనియర్ లెక్చరర్లు సమాజంకు ఉపయోగపడే సబ్జెక్టు చరిత్ర పరిరక్షణ కోసం కృషి చేయడం అభినందనీయం అని చెపుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చరిత్ర పరిరక్షణ ఉద్యమంకు తనవంతు సహాయ సహకారం అందిస్తాను అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ రాందాస్, జీజేఎల్ఎ అధ్యక్షులు తిరుపతి, శ్రీనివాస్, సునీల్ కుమార్, దివ్య మరియు ఇతర చరిత్ర లెక్చరర్లు పాల్గొన్నారు.