చరిత్రను కాపాడే బాధ్యత మీ పైనే ఉంది : డిఐఈఓ టి. రాజ్యలక్ష్మి

కరీంనగర్ (ఆగస్టు – 18) : చరిత్ర సబ్జెక్టు ప్రాధాన్యతను నేటి తరం విద్యార్థులకు తెలియజేసి, విద్యాబోధనలో చరిత్ర సబ్జెక్టును కాపాడే బాధ్యత చరిత్ర అధ్యాపకుల పైనే ఉందని ఇంటర్మీడియట్ విద్యాధికారి టి. రాజ్యలక్ష్మి అన్నారు. చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్ పోస్టరును ఇంటర్మీడియట్ విద్యాధికారి గురువారం రోజున తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగానికి జరిగే పోటీ పరీక్షలకు చరిత్ర సబ్జెక్టు చదవకపోతే ఉద్యోగం సాధించలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలలో మాత్రమే హెచ్.ఈ.సి. కోర్సు ఉందని, ఈ కోర్సును కాపాడుకునే బాధ్యత చరిత్ర అధ్యాపకులపై ఉందని అన్నారు. బీటెక్, బిఎస్సి, బీకాం, ఎంసీఏ, ఎంబీఏ లాంటి ఎన్ని కోర్సులు చేసిన చరిత్ర సబ్జెక్ట్ చదవకపోతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని తెలిపారు. కావున విద్యార్థులను ఇలాంటి గ్రూపులో చేర్పించడానికి ప్రత్యేక కృషి చేయవలసిన అవసరం చరిత్ర లెక్చరర్లకు సూచించారు. చరిత్ర సబ్జెక్టు పై ఉన్నా అపోహాలు తొలగించేందుకు ప్రతి చరిత్ర అధ్యాపకుడు కృషి చేయాలని అన్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు ప్రసారమాధ్యమాలలో కేవలం సాంకేతిక గ్రూపులు నీట్, జెఈఈ, అంశాలపై విస్తృత ప్రచారం జరుగుతుందన్నారు చరిత్ర సబ్జెక్ట్ పైన కూడా విస్తృత ప్రచారం చేయవలసినటువంటి బాధ్యత చరిత్ర అధ్యాపకులపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు సిహెచ్. శశిధర్ శర్మ, చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పి. తిరుపతి, చరిత్ర అధ్యాపకులు ఎం. సీతారామాంజనేయులు, సుదర్శన్, నరేష్, రాజు, మంగమ్మ, సునీత, దేవేందర్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us @