ఇష్టమైన సబ్జెక్టులతో డిగ్రీ చదివే బకెట్ విధానం అమలు – ఉన్నత విద్యా మండలి

హైదరాబాద్ (మార్చి – 10) : 2023-24 విద్యా సంవత్సరం డిగ్రీ తరగతులను జులైలో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మూడేళ్ల కిందట డిగ్రీలో సబ్జెక్టులను ఎంచుకునేందుకు ప్రవేశ పెట్టిన బకెట్ విధానంతోపాటు ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు, కరోనా అనంతరం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని అధిగమించే చర్యలు తదితర అంశాలపై ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ లతో విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం సమీక్షించారు. సమావేశంలో వీసీలు రవీందర్, తాటికొండ రమేష్, గోపాల్రెడ్డి, మల్లేశం, లక్ష్మీకాంత్ రాథోడ్, రవీందర్ గుప్తా పాల్గొన్నారు.

సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను లింబాద్రి విలేకర్లకు వెల్లడించారు. కరోనా తర్వాత 2020-21, 2021-22, 2022-23 విద్యా సంవత్సరం వరకు డిగ్రీతోపాటు అన్ని కోర్సుల తరగతులు సెప్టెంబరు నుంచి నవంబరు మధ్య ప్రారంభమవుతూ వచ్చాయని, వచ్చే ఏడాది మాత్రం డిగ్రీ తరగతులు జులైలో మొదలవుతాయని చెప్పారు.

◆ ముఖ్యమైన నిర్ణయాలు…

బీఎస్సీ ఎంపీసీ, ఎంపీసీఎస్ అని గతంలో కోర్సులుండేవి. అంటే ఆ కోర్సులో ఉన్న మూడు ప్రధాన సబ్జెక్టులు ఇష్టమున్నా లేకున్నా విద్యార్థులు చదవాల్సిందే. అందుకు భిన్నంగా మూడేళ్ల కిందట బకెట్ విధానాన్ని ప్రవేశ పెట్టి బీఎస్సీ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ విభజించారు. ఫిజికల్ సైన్స్ కొన్ని సబ్జెక్టులు, లైఫ్ సైన్స్ లో మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థులు వాటిలో తమకిష్టమైన మూడు సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఈ విధానాన్ని అన్ని కళాశాలలకు విస్తరిస్తారు.

బకెట్ విధానంలో చదివిన సబ్జెక్టులతో పీజీలో కొన్ని కోర్సుల్లో ప్రవేశించాలంటే అర్హత ఉండటం లేదని వీసీలు కొందరు ప్రస్తావించినందున ఆ సమస్యలు తలెత్తకుండా నిబంధనలను మారుస్తారు.

బకెట్ విధానం ప్రకారం ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మారుస్తారు. ఇప్పటివరకు బీఎస్సీ ఎంపీసీ, బీఎస్సీ ఎంపీసీఎస్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఇలా కోర్సులకు అనుమతి ఇచ్చేవారు. ఇక నుంచి బీఎస్సీ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ పేరిట ఇస్తారు. మూడేసి సబ్జెక్టులు ఏవి ఉండాలో ఆయా కళాశాలలు నిర్ణయించుకుంటాయి.

అనుబంధ గుర్తింపును ఇకపై యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ (యూఎంఎస్) పోర్టల్ ద్వారా ఇస్తారు. అది కూడా ఏటా కాకుండా మూడేళ్లకోసారి జారీ చేస్తారు. మొదటి సంవత్సరం స్వయంగా తనిఖీ చేసి ఇస్తారు. రెండు, మూడు సంవత్సరాలు మాత్రం ఆన్లైన్ లో డేటా తీసుకొని పరిశీలించి అనుమానం వస్తే ఆకస్మిక తనిఖీలు చేస్తారు. సీట్ల తగ్గింపు, పెంపు కూడా యూఎంఎస్ పోర్టల్ ద్వారానే జరుగుతుంది.

ప్రైవేటు కళాశాలలు న్యాక్ గుర్తింపునకు వెళ్లేందుకు అన్ని విధాలా సహకరిస్తారు. అందుకు త్వరలో కళాశాలల ప్రిన్సిపాల్ తో పాటు ఉపకులపతులతో వేర్వేరుగా కార్యశాలలు, సదస్సులు నిర్వహిస్తారు.