● మెస్సీ అరుదైన రికార్డ్.
ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో బార్సిలోనా స్టార్ ప్లేయర్ లయెనల్ మెస్సీ ఖాతాలో అరుదైన ఘనత చేరింది. వరుసగా 16 చాంపియన్స్ లీగ్ సీజన్లలో గోల్ చేసిన తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో అక్టోబర్ 21న ఫెరాస్కారోస్‌తో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన మెస్సీ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ వింగర్ ర్యాన్ గిగస్ కూడా 16 సీజన్లలో గోల్ చేసినప్పటికీ… వరుస సీజన్లలో గోల్ చేసిన ఆటగాడు మాత్రం మెస్సీనే.
● వైయస్సార్ బీమా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బియ్యం కార్డులున్న 1.41 కోట్ల కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ‘వైయస్సార్ బీమా’ పథకాన్ని తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 21న పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బ్యాంకర్లు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వేర్వేరుగా మొత్తం రూ.510 కోట్ల చెక్కులు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేశారు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.
● గాలి కాలుష్యం పై విడుదల అయిన నివేదిక పేరు.?
గాలిలో కాలుష్యకారకమైన సుక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణాలు పీఎం(పార్టిక్యులేట్ మ్యాటర్) 2.5 అంశంలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. అమెరికాకి చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టిట్యూట్ అండ్ గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ రూపొందించిన ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ (ఎన్‌ఓజీఏ) నివేదిక 2020’లో ఈ విషయం వెల్లడైంది. గాలిలో పీఎం 2.5 విలువ 75 నుంచి 85 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు లెక్క. గ్లోబల్ ఎయిర్ నివేదిక ప్రకారం భారత్‌లో 83 వరకు ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.గాలిలో పీఎం 2.51) భారత్ 83.22) నేపాల్ 83.13) రిపబ్లిక్ ఆఫ్ నైజర్ 80.14) ఖతార్ 76.05) నైజీరియా 70.4
* ఎన్‌ఓజీఏ నివేదికలోని ప్రధానాంశాలు ::
2019 ఏడాది భారత్‌లో వాయుకాలుష్యానికి 16 లక్షల 67 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో నెలలోపు వయసున్న పసిమొగ్గలే లక్షా 16 వేల మంది ఉన్నారు.భారత్ తర్వాత స్థానంలో నైజీరియా (67,900 మంది పిల్లల మృతి), పాకిస్తాన్ (56,500), ఇథియోపియా (22,900), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (1,200) ఉన్నాయి.గర్భిణీ స్త్రీలు కలుషితమైన గాలిని పీల్చడంతో గర్భంలో ఉన్న పిండంపై తీవ్ర ప్రబావాన్ని చూపిస్తోంది. దీనివల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ, తక్కువ బరువు, ఊపిరితిత్తులు బలంగా లేకపోవడం, రక్తంలో గడ్డలు ఏర్పడడం వంటి సమస్యలు పిల్లల్లో కనిపిస్తున్నాయి.
● జమ్మూకాశ్మీర్ లో ఎన్ని అంచెల పంచాయతీ రాజ్ విధానానికి కేంద్రం అమోదం తెలిపింది.?
జమ్మూకశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం- 1989 అమలు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 21న ఆమోదించింది. దీంతో మూడంచెల పంచాయతీరాజ్ విధానం కశ్మీర్లోనూ అమలు కానుంది. కశ్మీర్‌లో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్‌ను సేకరించే పథకాన్ని 2020-21 సీజన్‌లో కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది.
● కేంద్రం ఉద్యోగులకు ఎన్ని వేల కోట్ల బోనస్ ప్రకటించింది.?
దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్‌ను అందజేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్- పీఎల్‌బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ (నాన్ పీఎల్‌బీ లేదా అడ్‌హాక్) ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు.
● చైనా వ్యాక్సిన్ కొనుగోలును నిరాకరించిన దేశం.?
2,700 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి చైనా నుంచి 4.6 కోట్ల ‘కరోనావాక్’ అనే కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను కొనాలని బ్రెజిల్ ఆరోగ్య శాఖామంత్రి తీసుకున్న నిర్ణయాన్ని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తిరస్కరించారు. చైనా ఔషధ కంపెనీ సినోవాక్ తయారు చేస్తోన్న ఈ వ్యాక్సిన్ ప్రయోగాలన్నీ ఇంకా పూర్తి కాలేదని, ప్రయోగాలకు వాడుకునేందుకు బ్రెజిల్ ప్రజలు గినియా పందులు కారని బోల్సోనారో వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 1,54,906 మరణాలు సంభవించాయి.
● జపాన్ కి చెందిన ఏ యూనివర్సిటీతో టీసీఎస్ ఒప్పందం కుదుర్చుకుంది.?
పరిశ్రమపై సంయుక్తంగా అధ్యయనం చేసేందుకు టోక్యో యూనివర్సిటీతో (యూటోక్యో) చేతులు కలిపినట్లు ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్ 21న వెల్లడించింది. వ్యాపార, సామాజిక సవాళ్లను డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధిగమించే మార్గాలపై ఈ ఒప్పందం ద్వారా అధ్యయనం చేయనున్నారు. ఇది ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల పరిష్కారానికే కాకుండా, భారత్-జపాన్ సంబంధాలను మరింత మెరుగుపర్చేందుకు, ఇరు దేశాల వృద్ధికి దోహదపడగలదని యూటోక్యో ప్రెసిడెంట్ మకొటో గొనొకమి తెలిపారు.
● ఎవరి హత్య కేసులో సౌదీ యువరాజు పై నష్ట పరిహారం కేసు నమోదయింది.?
రెండు సంవత్సరాల క్రితం ఇస్తాంబుల్‌లో జరిగిన దారుణ హత్యకు నష్టపరిహారం కోరుతూ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి కాబోయే భార్య సెంగిజ్ సౌదీ అరేబియా యువరాజు, ఇతర అధికారులపై మంగళవారం అమెరికా కోర్టులో కేసు దాఖలు చేసింది. సౌదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అమెరికా రచయిత జమాల్ ఖషోగ్గి పలు కథనాలు రాశాడు.దీంతో సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఖషగ్గీని హత్య చేయించాడని అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్య కార్యాలయానికి వెళ్ళిన ఖషోగ్గి అక్టోబరు 2, 2018న హత్యకు గురయ్యాడు.
● ఆన్లైన్ చెల్లింపు లకు ఏ క్యూఆర్ కోడ్‌లు మాత్రమే ఉండాలని ఆర్బీఐ తెలిపింది.?
చెల్లింపుల లావాదేవీల కోసం పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు (పీఎస్‌వో) కొత్తగా మరిన్ని సొంత క్యూఆర్ కోడ్‌లను ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూపీఐ క్యూఆర్, భారత్ క్యూఆర్ కోడ్‌లనే కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. సొంత క్యూఆర్ కోడ్‌లు ఉపయోగించే పీఎస్‌వోలు కూడా ఈ రెండింటికి మారాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ 2022 మార్చి 31 నాటికి పూర్తి కావాల్సి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. జపాన్‌కి చెందిన డెన్సో వేవ్ అనే సంస్థ 1990లలో క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్‌లను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశీయంగా క్యూఆర్ కోడ్ పేమెంట్ సిస్టమ్‌లు ప్రధానంగా భారత్ క్యూఆర్, యూపీఐ క్యూఆర్‌లతో పాటు సంస్థల సొంత క్యూఆర్‌లను సపోర్ట్ చేస్తున్నాయి.
● జియో మొబైల్ బ్రౌజర్ పేరు.?
సరికొత్తగా తీర్చిదిద్దిన దేశీ మొబైల్ బ్రౌజర్ ‘జియోపేజెస్’ను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. ఇది ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని సంస్థ వెల్లడించింది. గూగుల్ ప్లేస్టోర్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు జియో ప్రతినిధి తెలిపారు. వేగవంతంగా పేజ్ లోడింగ్, మెరుగ్గా మీడియా స్ట్రీమింగ్, ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్ మొదలైన ప్రత్యేకతలు ఈ బ్రౌజర్‌లో ఉన్నాయని వివరించారు. ‘ఇన్ఫర్మేటివ్ కార్డ్’ ఫీచరు ద్వారా వార్తలు, క్రికెట్ స్కోర్ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు.
● విశాఖ లో జల ప్రవేశం చేసిన సబ్ మెరైన్ యుద్ధ నౌక పేరు.?
యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవరట్టి ఇవాళ విశాఖపట్టణంలోని నౌకాశ్రయంలో జలప్రవేశం చేసింది. ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే దీనిని కమిషన్ చేశారు. ప్రాజెక్ట్ 28(కమోర్టా క్లాస్) లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ నౌకల్లో ఐఎన్‌ఎస్ కవరట్టి చివరిది. డైరక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కవరట్టిని డిజైన్ చేసింది. కోల్‌కతాకు చెందిన గార్డెన్ రీసర్చ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించారు. ఇక ఇది పెరుగుతున్న భారత నౌకదళం, జీఆర్‌ఎస్‌ఈ సామర్థ్యాన్ని చూపించడమే కాక దేశీయంగా తయారు చేయడంతో భారత్ స్వావలంబనకు నిదర్శనంగా నిలవడమే కాక.. జాతీయ లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్‌ని ఉద్ఘాటిస్తుంది అన్నారు అధికారులు. ఇక కవరట్టిలో అత్యాధునిక ఆయుధాలు, జలాంతర్గాములను గుర్తించి ప్రాసిక్యూట్ చేయగల సెన్సార్ సూట్ ఉందని భారత నావికాదళం తెలిపింది. ఇక ఐఎన్‌ఎస్ కవరట్టి 90 శాతం దేశీయంగా తయారయ్యింది.
● నౌకాదళంలోకి ముగ్గురు మహిళలు.
భారత నౌకాదళంలో నవశకం మొదలైంది. సముద్రంపై గస్తీ కోసం ముగ్గురు మహిళా పైలట్లు అర్హత సాధించారు. లెఫ్టినెంట్ దివ్యశర్మ, లెఫ్టినెంట్ శుభాంగి స్వరూప్, లెఫ్టినెంట్ శివాంగి.. ఈ ముగ్గురు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సముద్రంపై గస్తీ నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారని రక్షణరంగ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. . ఈ ముగ్గురు మొదట ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్లుగా శిక్షణ పొందారు. తర్వాత శివాంగి మొదటిసారిగా నౌకాదళ పైలట్‌గా 2019 డిసెంబర్ 2న అర్హత సాధించారు. 15 రోజుల తర్వాత మిగతా ఇద్దరు కూడా అర్హత సాధించారు. తర్వాత వీరంతా ఒక బృందంగా ఏర్పడి డీవోఎఫ్‌టీ కోర్సులో చేరారు. దివ్య శర్మ ఢిల్లీ, శుభాంగి యూపీ, శివాంగి బీహార్‌కు చెందినవారు.
● ఫోర్బ్స్ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యత్తమ కంపెనీలలో చోటు సంపాదించిన భారత కంపెనీ.?
ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) మరో విశిష్ఠ ఘనత సాధించింది. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యత్తమ కంపెనీలతో రూపొందించిన జాబితాలో చోటు దక్కించుకున్న భారత ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్‌యూ)ల్లో ఎన్టీపీసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీపీసీయే వెల్లడించింది. ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో తమకు గల నిబద్ధతకు ఈ గుర్తింపే నిదర్శనమని ఎన్టీపీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
● హైదరాబాద్ మెట్రో ఎండీ కి దక్కిన అవార్డు.?
ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్(ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్) ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డికి ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ప్రస్తుత సంవత్సరానికిగాను కన్‌స్ట్రక్షన్ వరల్డ్ గ్లోబల్ అవార్డ్ అనే సంస్థ ‘కన్‌స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా కేవీబీ రెడ్డి మాట్లాడుతూ.. మూడున్నర దశాబ్దాలకుపైగా వృత్తి జీవితంలో చాలా నేర్చుకున్నానని, ఇది ఎంతో ఆనందాన్నిచ్చిందని, ప్రతిష్ఠాత్మకమైన ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
Follow Us @