● బోటు అంబెలెన్సులను ప్రారంభించిన రాష్ట్రం.?
బోటు అంబెలెన్సులను ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం రెండు బోటు అంబులెన్సులను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 108 మాదిరిగానే ఫోన్ చేయగానే బోట్లను పంపి ఆదుకుంటు అన్నారు. బంగళాఖాతానికి సరిహద్దులో ఉన్న ఒడిశా తీరప్రాంత జిల్లా కేంద్రపారా జిల్లాలో ప్రస్తుతం ఈ కొత్తరకం అంబులెన్సులు సేవలందిస్తున్నాయి. భితార్కానికా నేషనల్ పార్క్ ప్రాంతాలు అనేక రకాల మడ అడవులకు ప్రసిద్ది. ఈ ప్రాంతాన్ని భాగాలుగా విభజించే చిన్న, పెద్ద నదులు చాలా ఉన్నాయి. దీనివల్ల మారుమూల గ్రామాల్లో రోడ్ల ద్వారా ప్రయాణించడం చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గ్రామాలకు చేరుకోవడం కష్టమవుతుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ఒడిశా ప్రభుత్వం బోటు అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది.
● ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెట్టె ఖర్చు ను ఎంత శాతం పెంచారు.?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులకు అయ్యే ఖర్చు పరిమితిని పది శాతం పెంచారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రతిపాదనల ప్రకారం ఈ విషయం స్పష్టమైంది. కొత్త ఆదేశాల ప్రకారం లోక్‌సభ అభ్యర్థులు గరిష్టంగా రూ.77 లక్షలు ప్రచారం కోసం ఖర్చు చేసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 70 లక్షలు ఉండేది. ఇక అసెంబ్లీ స్థానాలకు ఖర్చు పరిమితిని 28 నుంచి 30.8 లక్షలకు పెంచారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పరిమితి రాష్ట్రాలవారిగా మారుతుంది. గరిష్ట ఖర్చు పరిమితిని పెంచుతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించినా.. దానికి కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. * ఎంపీ అభ్యర్థి – 77 లక్షలు (70 లక్షలు) * ఎమ్మెల్యే అభ్యర్థి – 30.8 లక్షలు (28 లక్షలు)
● ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ పొడితో గీసిన పెయింటింగ్ పేరు.?
సౌదీ అరేబియాకి చెందిన ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి అనే మహిళా కళాకారిణి 4.5 కిలోల పనికిరాని కాఫీ పొడితో సౌదీ అరేబియా స్థాపకులైన కింగ్ అబ్దుల్ అజీజ్, షేక్ జైద్‌ల చిత్రాలను గీశారు. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఏడు వస్త్రాల కాన్వాస్‌పై 220 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ పెయింటింగ్‌ను వేశారు. ‘నసీజ్1’గా పిలుస్తున్న ఈ పెయింటింగ్‌ను గిన్నిస్ ప్రపంచ రికార్డు వరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ పెయింటింగ్‌గా నసీజ్1 నిలిచింది.
* తొలి సౌదీ అరేబియా మహిళ…
నసీజ్1 విషయమై గిన్నిస్ రికార్డ్స్ సంస్థ స్పందిస్తూ… గతంలో ఒకరి కంటే ఎక్కువ మంది సౌదీ మహిళలు కలిసి ఇలాంటి పెయింటింగ్‌స వేసినట్టు తెలిపింది. 2015లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి రియాద్‌లో 8,264 మంది మహిళలు కలిసి అతిపెద్ద హ్యూమన్ ఎవేర్నెస్ రిబ్బన్‌ను రూపొందించారని పేర్కొంది. కానీ ఒక సౌదీ మహిళ ఒంటరిగా గిన్నిస్ రికార్డు సాధించడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా నుంచి గిన్నిస్ జాబితాలో చోటు దక్కించుకున్న మొదటి మహిళగా ఓహుద్ అబ్దుల్లా అల్మాల్కి రికార్డు సాధించింది.
● పోట్రేయిట్స్ ఆఫ్ పవర్ పుస్తక రచయిత ఎవరు.?
అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ రాసిన పుస్తకం ‘పోట్రేయిట్స్ ఆఫ్ పవర్’ విడుదలైంది. ఈ పుస్తకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అక్టోబర్ 19న ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ పాల్గొన్నారు.
● కరోనా వ్యాక్సిన్ కోసం భారత ప్రయత్నాలు.
భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా…. తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి.. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అక్టోబర్ 18న తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు.
* వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్-19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో భారత్ బయోటెక్ ఒప్పందాలు కుదుర్చుకుంది.
* పుట్టగొడుగులతో రోగనిరోధక శక్తి ఔషధం
పుట్టగొడుగులతో తయారుచేసిన రోగనిరోధక శక్తి పెంపు ఔషధం త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. కరోనా నేపథ్యంలో ఈ ఔషధాన్ని తీసుకొస్తున్నట్లు క్లోన్‌డీల్స్, ఆంబ్రోసియా ఫుడ్ ఫామ్ సంస్థలు తెలిపాయి.
● ప్రపంచంలోనే ‘మేటి వంద మంది శాస్త్రవేత్తల్లో ఒకరిగా నిలిచిన తెలుగు వ్యక్తి ఎవరు.?
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ప్రొఫెసర్ చల్లపల్లి సూర్యనారాయణకు అరుదైన గుర్తింపు లభించింది. పదార్థ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ప్రపంచంలోనే ‘మేటి వంద మంది శాస్త్రవేత్తల్లో ఒకరిగా ఆయన నిలిచారు. అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో చల్లపల్లి సూర్యనారాయణకు 55వ స్థానం దక్కింది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన సూర్యనారాయణ అక్కడే కొంతకాలం ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. 1988 తర్వాత నుంచి అమెరికాలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదార్థ విజ్ఞాన శాస్త్ర రంగంలో చేసిన సేవలకు దేశ, విదేశాల నుంచి అనేక పురస్కారాలను అందుకున్నారు.
● ఐపీఎల్ లో వరుసగా రెండు సెంచరీ లు కొట్టిన ఆటగాడు ఎవరు.?
ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్ రికార్డు నెలకొల్పిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్.. మరో ఘనతను కూడా నమోదు చేశాడు. ఐపీఎల్లో ఐదువేల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. మంగళవారం కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధావన్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా ఐపీఎల్లో ఐదువేల పరుగులు సాధించిన ఐదో ప్లేయర్‌గా గబ్బర్ నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి(5,759) ముందు వరుసలో ఉండగా, సురేశ్ రైనా(5,368), రోహిత్ శర్మ(5,158), డేవిడ్ వార్నర్(5,037)లు ఆ తర్వాత వరుస స్థానాల్లో ఉన్నారు.
● ప్రజాస్వామ్యం పట్ల యువత అభిప్రాయం.?
ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల యువతకు క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. తాజాగా ప్రపంచంలోని 160 దేశాల నుంచి 35 ఏళ్ల లోపు యువత నుంచి అభిప్రాయాలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ సేకరించగా కేవలం 48 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 54 శాతం ఉండగా, అది 1950వ దశకానిని 57 శాతానికి పెరిగింది. 1990, రెండువేల సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరం భారీగా పెరగడంతో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 62 శాతానికి పెరిగింది. 160 దేశాల నుంచి 50 లక్షల మంది యువతను శాంపిల్‌గా తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఈ సర్వేను నిర్వహించింది.
● బియ్యపు గింజల పై భగవద్గీత.
బియ్యపుగింజలపై కేవలం 150 గంటల్లోనే భగవద్గీత రాసి యువతి రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన రామగిరి స్వారిక అనే లా స్టూడెంట్ ఈ అరుదైన ఘనతను సాధించి అందరి ప్రశంసలు అందుకొంటుంది. భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలతో 4,042 బియ్యపు గింజలపై రాశారు. చిన్నతనం నుంచే తనకు కళలపై ఆసక్తి ఎక్కువని గత కొన్నేళ్లుగా మైక్రో ఆర్ట్ చేస్తున్నానని వివరించింది. 2017లో ఒకే బియ్యపు గింజపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ మైక్రో ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వారిక చోటు సంపాదించుకున్నారు. స్వారిక ప్రతిభకు గానూ గతేడాది నార్త్ డిల్లీ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రధానం చేసింది. ఇప్పటివరకు వెయ్యికి పైగా మైక్రో డిజైనింగ్ చేసి పలు సత్కారాలు అందుకొంది.