కోవిడ్ టీకా కోసం రిజిస్ట్రేషన్ అవసరమా?

వ్యాస కర్త.. Dr. తిరుపతి పోతరవేని, లెక్చరర్, కరీంనగర్.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 28 వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ మూడవ దశ మే 1 నుండి దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుందని, ఈ దశలొ 18 నుండి 44సంవత్సరాల మధ్య వయిస్సు వారికీ కోవిద్ టీకా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలని పేర్కొంటూ, టీకా తీసుకొనే ప్రతి ఒక్కరూ cowin.gov.in వెబ్సైటు లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటన చేశారు.

కోవిడ్ వాక్సిన్ కోసం 18 నుండి 44 సంవత్సరాల వయస్సు మధ్య ప్రతి ఒకరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలొ నివసించే అన్ని కుటుంబాల వారికి స్మార్ట్ ఫోన్ ఉన్నదా? వారికి నెట్ సౌకర్యం ఉందా? స్మార్ట్ ఫోన్ ఉన్న టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే పరిజ్ఞానం ఉందా? స్మార్ట్ ఫోన్ లేనివారు టీకా కోసం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకుంటారు? స్మార్ట్ ఫోన్ ఉన్నవారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఒక నెంబరుకు నాలుగు ఓటీపీలు మాత్రమే రావడం వలన నలుగురు వ్యక్తులు మాత్రమే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు మాత్రమే ఉంటారా? మిగిలిన వ్యక్తుల కోసం ఏ విధంగా టీకా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు?

స్మార్ట్ ఫోన్ వాడే అక్షరాస్యులలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు మాత్రమే టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. వీరిలో సాంకేతిక పరిజ్ఞానం లేనివారు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతే వారికి టీకా ఇవ్వరా? వీరి కంటే ఎక్కువ జనాభా ఉన్న నిరక్షరాస్యులు టీకా కోసం ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో? ఆలోచించాలి. ఒకవైపు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు సైబర్ నేరగాళ్లు టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే వారిపై వల విసిరి మోసం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అలాగే వారి బ్యాంక్ ఖాతాలను కూడ కోల్లగొడుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజలను మానసిక ఆందోళనకు గురి చేయకూడదని, ఇలాంటి హాస్యాస్పదమైన ప్రకటనలను భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవలసిన బాధ్యత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖపై ఉందని గ్రహించాలి. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయివరకు ఎన్నికల పోలింగ్ బూత్ ప్రకారం 18 నుండి 44 సంవత్సరాల వయసు మధ్య వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ విజయవంతంగా అందించాలని మేధావులు కోరుతున్నారు.

Follow Us@