COSMIC RAYS : బయటి గెలాక్సీ నుంచి వచ్చిన కాస్మిక్ కిరణం

BIKKI NEWS (NOV. 25) : అతి శక్తివంతమైన ఒక కాస్మిక్ కిరణం మన పాలపుంత గెలాక్సీకి వెలుపలి నుంచి వచ్చినట్లు (cosmic rays from outer galaxy) శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది నిర్దిష్టంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది అంతు చిక్కకుండా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని ఉతా విశ్వవిద్యాలయంలో ఉన్న టెలిస్కోపు ఈ రేణువులను గుర్తించింది.

భూమిని చేరిన శక్తిమంతమైన కాస్మిక్ కిరణాల్లో ఇదే రెండో స్థానంలో నిలిచింది. దీనికి ‘అమతేరసు’ (జపాన్ ఇతిహాసాల్లో సూర్య భగవానుడి పేరు) అని నామకరణం చేశారు.

1991లో వెలుగు చూసిన ‘ఓ మై గాడ్’ కిరణం.. ఇప్పటివరకూ భూమిని చేరిన అత్యంత శక్తిమంతమైన కాస్మిక్ కిరణంగా గుర్తింపు పొందింది.

కాస్మిక్ కిరణాల్లో ప్రొటాన్లు లేదా ఎలక్ట్రాన్లు వంటి ఆవేశిత రేణువులు ఉంటాయి. అవి విశ్వంలో కాంతివేగంతో పయనిస్తాయి. ఈ రేణువులు అంతరిక్షంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాలకు సంబంధించిన అవశేషాలై ఉండొచ్చని భావిస్తున్నారు.

భూమిని చేరే క్రమంలో అవి మార్గమధ్యంలో ఎక్కడా అయస్కాంత క్షేత్రాల ప్రభావానికి లోనై ఉండవని, అందువల్ల వాటి మూలాలను నిర్దిష్టంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.