61 ఏండ్ల వరకు కాంట్రాక్టు అధ్యాపకుల కొనసాగింపు

హైదరాబాద్ (జనవరి – 29) : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరం (2022-23)లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను పునరుద్ధరి స్తున్నట్టు ఇంటర్‌ విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వారిని ప్రస్తుత విద్యాసంవత్సరంలో పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 12న ఉత్తర్వులు విడుదల చేసిందని గుర్తు చేశారు.

కాంట్రాక్టు పద్ధతిలో 3,722 మంది అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు. వారిలో 3,541 మంది కాంట్రాక్టు పద్ధతిలో, 103 మంది మినిమం టైం స్కేల్‌ లేదా పార్ట్‌టైం పద్ధతిలో, 78 మంది ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారని వివరించారు. వారిని 61 ఏండ్ల వరకు కొనసాగించొచ్చని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి వర్తిస్తుందని తెలిపారు. దీంతో 58 ఏండ్లు నిండిన కాంట్రాక్టు అధ్యాపకులు కొనసాగేందుకు అవకాశం లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉద్యోగ విరమణ పొందిన వారు మళ్లీ విధుల్లో చేరేందుకు అవకాశమున్నది.