ఇంజనీరింగ్ కు జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష.!

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 22) : ఒకే దేశం – ఒకే ప్రవేశపరీక్ష విధానాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నీట్ తరహాలోనే ఇంజినీరింగ్ కి కూడా జాతీయ స్థాయిలో ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది.

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి 2016 నుంచి నీట్ నిర్వహిస్తుండగా.. గత ఏడాది నుంచి దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ సీట్ల భర్తీకి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2023-24 విద్యాసంవత్సరం నుంచి 57 కేంద్ర, రాష్ట్ర విద్యాసంస్థల్లో ప్రవేశపెట్టనున్న నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ సీట్లను కూడా జాతీయ ప్రవేశపరీక్ష ద్వారానే నింపుతామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.

కాగా అన్ని రాష్ట్రాల్లోని బీటెక్ సీట్ల భర్తీకి కూడా జాతీయస్థాయి ప్రవేశపరీక్ష జరపాలని 2016 నుంచే కేంద్రం యోచిస్తోంది. ఎన్ఐటీల్లో సీట్ల భర్తీకి 2013 నుంచి జేఈఈ మెయిన్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఆ పరీక్షలో అన్ని రాష్ట్రాలు చేరితే ఇంజినీరింగ్ ప్రవేశాలకు వినియోగించుకోవచ్చన్నది ఆలోచన. ఈమేరకు అప్పట్లో కేంద్రం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకుని అమలు చేయనున్నారు.