KCR SPEECH AT 77th INDEPENDENCE DAY

హైదరాబాద్ (ఆగస్టు – 15) : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు:

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.

గత ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించు కుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.

75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలూ విధ్వంసమైపోయాయి. నాటి తెలంగాణ నాయకత్వం సమైక్య నాయకులకు కొమ్ముకాస్తూ చేవచచ్చి చేష్టలుడిగి ప్రవర్తించడం వల్లనే తెలంగాణ తీవ్రమైన వివక్షకు, దోపిడీకి గురైంది. తెలంగాణ ప్రజలందరూ ఒక్కతాటిపై నిలిచి చేసిన సుదీర్ఘ ప్రజాఉద్యమం ఫలితంగా స్వరాష్ట్ర స్వప్నం సాకారమైంది.

పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ గుండెలు పిండేసినట్లయి దు:ఖం తన్నుకొస్తది. ఎటుచూసినా పడావుపడ్డ పొలాలు, పూడుకపోయి తుమ్మలు మొలిచిన చెరువులు, ఎండిపోయి దుబ్బతేలిన వాగులు, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోయిన బావులు, పాతాళం లోతుకు పోయినా సుక్క నీరుకానరాని బోర్లు, ఎడతెగని కరంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నల జీవితాలు, అప్పుల ఊబిలో చిక్కి ఆశలు సైతం అడుగంటి ఆఖరుకు ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు, బతుకుమీద ఆశ చచ్చి ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు, యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు, ఇండ్లకు తాళాలు పడి గడ్డి మొలుస్తున్న గోడలు, మొరం తేలిన వాకిళ్లు, ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు, గంజి కేంద్రాలతో ఆదుకోవాల్సిన గడ్డు పరిస్థితులు.

ఇటువంటి అగమ్య గోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్రయజ్ఞంగా నిర్వహించింది. నిజాయితీతో, నిబద్ధతతో, నిరంతర మేధోమధనంతో అవిశ్రాంతంగా శ్రమించింది. విధ్వంసమైపోయిన తెలంగాణను విజయవంతంగా వికాసపథం వైపు నడిపించింది.

ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఎరిగిన ప్రభుత్వం కనుక, దానికి అనుగుణంగా అన్నిరంగాలనూ ప్రక్షాళన చేసింది. అనతి కాలంలోనే తిరుగులేని ఫలితాలను సాధించింది. అనేక రంగాలలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. దార్శనిక దృక్పథంతో, పారదర్శక విధానాలతో, అభివృద్ధిలో, సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కింది. “తెలంగాణ ఆచరిస్తుంది – దేశం అనుసరిస్తుంది” అనే దశకు చేరుకొని దశాబ్ది ముంగిట సగర్వంగా నిలిచింది.

నేడు తెలంగాణ జీవన దృశ్యాన్ని చూస్తే.. నిరంతర విద్యుత్తు ప్రసారంతో వెలుగులు వెదజల్లుతున్నది. పంట కాల్వలతో, పచ్చని చేన్లతో కళకళలాడుతున్నది. మండే ఎండలలో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. వాగులు, వంకలు, వాటిపై నిర్మించిన చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. తరలివస్తున్న కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతున్నది. ఒకనాడు చుక్క నీటికోసం అలమటించిన తెలంగాణ ఇపుడు ఇరవైకి పైగా రిజర్వాయర్లతో పూర్ణకలశం వలె తొణికిసలాడుతున్నది. మూడు కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడితో నేడు తెలంగాణ దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతున్నది. సంక్షేమంలో, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తున్నది. దశాబ్దకాలంలో తెలంగాణ సాధించిన అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది. ఈ అద్భుతమైన పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా తెలంగాణ ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని ఇదే రీతిన అందించాలని హృదయ పూర్వకంగా మనవి చేస్తున్నాను.
ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం గానీ, ఒక రాష్ట్రం గానీ సాధించిన ప్రగతికి ప్రమాణంగా చూసే ప్రబల సూచికలు రెండు.

◆ తలసరి ఆదాయం, తలసరి విద్యుత్తు వినియోగం:

ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పటిష్టమైన క్రమశిక్షణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసింది. సంపద పెంచింది. ప్రజలకు పంచింది. దేశంలో స్థిరపడిన పెద్ద రాష్ట్రాలను అధిగమించి నూతన రాష్ట్రం తెలంగాణ 3 లక్షల 12 వేల 398 రూపాయల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచింది.

అదేవిధంగా తలసరి విద్యుత్తు వినియోగంలో జాతీయ సగటు అయిన 1,255 యూనిట్లను అధిగమించింది. దేశ సగటుకంటే 70శాతం అత్యధికంగా 2,126 యూనిట్ల సగటు వినియోగంతో తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ – 1 గా నిలిచింది.

◆ వెలుగు జిలుగుల తెలంగాణ

విద్యుత్తు రంగంలో తెలంగాణది స్ఫూర్తిదాయకమైన విజయగాథ. అనతికాలంలోనే అన్నిరంగాలకూ 24 గంటలపాటు, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. విద్యుత్తు రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి అన్నిరంగాలనూ ప్రభావితం చేసింది. రాష్ట్రం ప్రగతిపథంలో పయనించేందుకు నిరంతర విద్యుత్తు చోదకశక్తిగా పనిచేసింది.

◆ అతివృష్టి – సహాయ చర్యలు


రాష్ట్రంలో గత నెలలో అనూహ్యంగా, అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిసాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అతివృష్టి పరిస్థితులను అంచనా వేస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి,ఆయా ప్రదేశాలకు సుశిక్షితులైన సిబ్బందినీ, పడవలనూ, ఎన్.డి.ఆర్.ఎఫ్ బృందాలను, భారత వైమానిక దళానికి చెందిన హెలికాఫ్టర్లను వినియోగించింది. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ శిబిరాలు ఏర్పాటుచేసి ఆదుకున్నది. తక్షణ సహాయ చర్యల కోసం ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఊహించనిరీతిలో కుంభవృష్టి కురిసి, వరదలు సంభవించినా, ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకొని ప్రాణ నష్టాన్ని, ఆస్తినష్టాన్నిచాలావరకు నివారించగలిగింది.

అతివృష్టి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటుంది. దెబ్బతిన్న ఇళ్ళకు గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం సాయం అందిస్తుంది. వరదలలో కోతకు గురైన పొలాల సంఖ్యను అంచనా వేయడం జరుగుతున్నది. జూన్, జూలై మాసాల్లో వర్షపాతంలో కలిగిన లోటును ఈ భారీ వర్షాలు భర్తీ చేశాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాలూ నిండుకుండలుగా మారాయి. ఈసారి వరిసాగు రికార్డు స్థాయిలో 64 లక్షల 54 వేల ఎకరాలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. పంటలు దెబ్బతిన్న రైతులు మళ్లీ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్నివేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను.

◆ రైతు సంక్షేమం

రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటివరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంటరుణాల మాఫీ చేపట్టింది. మొత్తంగా తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండు దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు 37 వేల కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసింది. దేశం మొత్తంమీద రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సవినయంగా తెలియజేస్తున్న.

మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైంది. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబును ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీపడుతున్నది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు.

వ్యవసాయానికి మూడుగంటల విద్యుత్తు సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగు విధంగా సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నాను.

సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలసల జిల్లాగా పేరుపడి గోసెల్లదీసిన పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు, 1200 గ్రామాలకు తాగునీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే, న్యాయం ఎన్నటికైనా గెలుస్తుంది అన్న నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలించాయి. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదల వహించి, అతి త్వరలోనే ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నాను. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని మనవి చేస్తున్నాను.

◆ పోడు భూములకు పట్టాలు

దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ, గిరిజనుల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ప్రభుత్వం వారిలో ఆనందం నింపింది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకుపైగా పోడు భూములపై యాజమాన్య హక్కులు కలిగించింది. వారందరికీ రైతుబంధు పథకాన్ని సైతం వర్తింపజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించింది. పోడు భూముల కోసం జరిగిన ఆందోళనల్లో నమోదైన కేసుల నుంచి విముక్తులను చేసింది.

◆ డబుల్ బెడ్రూం ఇండ్లు – గృహలక్ష్మి పథకం

గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలని ఒకే ఒక్క ఇరుకుగది. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడకగదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నది. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 1 లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రభుత్వం నేటినుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నది. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నది. ముందుగా, ప్రతీ నియోజకవర్గంలో 3 వేలమందికి ఈ ప్రయోజనం చేకూరుస్తున్నది. ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది.

◆ ఇంటింటికీ సురక్షిత జలాలు

తాగునీటి సమస్యను సంపూర్ణంగా పరిష్కరించిన రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇండ్లల్లో ఉచితంగా ప్రభుత్వమే నల్లాలను బిగించి, సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఇప్పుడు రాష్ట్రంలో వీధి నల్లాల అవసరం లేకుండా పోయింది. మహిళలు బిందెలతో వీధివీధి తిరగాల్సిన దుర్గతి తొలగిపోయింది. మిషన్ భగీరథకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయి. తెలంగాణ ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం పార్లమెంటు వేదికగా ప్రకటించింది.

◆ సమస్త జనులకూ సంక్షేమ ఫలాలు

దళితుల నుంచి బ్రాహ్మణుల వరకు సమాజంలోని అన్నివర్గాల పేదలకూ సంక్షేమ ఫలాలను అందజేస్తూ తెలంగాణ సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నది. తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతూ వివక్షకు గురవుతున్నదళితజాతి స్వావలంబన కోసం ప్రభుత్వం తెలంగాణ దళితబంధు పథకం అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు దేశానికి దిక్సూచిగా నిలిచింది. ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అందుకున్న కుటుంబాల విజయగాథలు నేడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి.

దళిత కుటుంబం తమకు నచ్చిన, వచ్చిన వృత్తి లేదా వ్యాపారాన్ని చేపట్టడం కోసం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 10 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని నూటికి నూరుశాతం గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వ లైసెన్సుతో చేసే లాభదాయక వ్యాపారాల్లో దళితులకు 15శాతం రిజర్వేషన్ను కల్పిస్తున్నది. లబ్ధిపొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురై ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి వస్తే ఆదుకునేందుకు ప్రభుత్వం దళిత రక్షణ నిధిని సైతం ఏర్పాటు చేస్తున్నది. ఇదే తరహాలో బలహీన వర్గాల్లోని వృత్తిపనుల వారికీ, మైనారిటీ వర్గాలకూ కుటుంబానికి లక్ష రూపాయల వంతున ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం అందిస్తున్నది.

దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని ప్రభుత్వం 6 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచడంతోపాటు, ఈ పథకం వర్తించే ఆలయాల సంఖ్యను కూడా పెంచింది.

ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గొల్ల కుర్మలకుభారీ ఎత్తున గొర్రెల పంపిణీ, మత్స్యకారులకోసం చేపల పెంపకం వంటి చర్యలు చేపట్టింది. గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు చేసింది. పాత బకాయిలు మాఫీ చేసింది. మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. రైతు బీమా తరహాలో గీతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల బీమా కల్పించింది.

◆ నేతన్నలకు వరాలు

నేత కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వారికోసం అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. నూలు రసాయనాలపై 50శాతం సబ్సిడీని అందజేస్తూ నేతన్నకు చేయూతనిస్తున్నది. గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం ‘‘తెలంగాణ చేనేత మగ్గం’’ అనే కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్నది.

◆ దివ్యాంగులకు పెన్షన్ పెంపు

తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను వాసిలోనూ, రాశిలోనూ పెంచింది. అసహాయులకు జీవన భద్రతకోసం అందించే పెన్షన్ను 200 నుంచి 2,016 రూపాయలకు పెంచింది. 2014 నాటికి ఆసరా లబ్దిదారుల సంఖ్య కేవలం 29 లక్షలు. నేడు ఆసరా పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారుల సంఖ్య 44 లక్షలు. వృద్ధులు, వితంతువులు,దివ్యాంగులతో పాటు బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ సౌకర్యం కల్గించింది. పెన్షన్ పొందేందుకు వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. ప్రభుత్వం ఇటీవల దివ్యాంగుల పెన్షన్ను 3016 నుంచి 4016 రూపాయలకు పెంచింది. తద్వారా దివ్యాంగుల బతుకుల్లో మరింత ధీమాను నింపింది.

◆ ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనం

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం, సంస్థ ప్రయోజనాలు, సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వమే బడ్జెట్లో అందిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంస్కరణల ఫలితంగానే ఆర్టీసీ సంస్థ గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలను సాధించగలుగుతోంది. కానీ, నష్టాలు మాత్రం తప్పడంలేదు. అయినా ఆర్టీసీ సంస్థను కాపాడాలి, అందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం చూడాలనే లక్ష్యంతో 43 వేల 373 మంది ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండింది.

◆ వైద్యారోగ్య రంగంలో అద్భుత ప్రగతి

రాష్ట్రం ఏర్పాటయ్య నాటికి తెలంగాణ ప్రాంతంలో కేవలం మూడే వైద్య కళాశాలలు ఉండేవి. వీటిలో ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు నుంచీ ఉన్నవే. ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఉద్యమ ఒత్తిడికి తలొగ్గి ఆదిలాబాద్, నిజామాబాదులో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకొక వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే విధాన నిర్ణయం తీసుకొని స్వల్పకాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి చరిత్ర సృష్టించింది. మరో 8 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇటీవలనే క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇవి కూడా త్వరలోనే ప్రారంభించి, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని ప్రభుత్వం పరిపూర్తిచేయబోతున్నది. వైద్య ఆరోగ్యరంగంలో తెలంగాణ అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న పథకాలు అద్భుతమైన ఫలితాలు అందించాయి. వైద్య ఆరోగ్యరంగంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టాయి.

కోట్లాది మంది దృష్టి లోపాలను సరిదిద్దిన కంటి వెలుగు కార్యక్రమం, ఉచిత డయాలసిస్ సేవా కేంద్రాల ఏర్పాటు, ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ల పంపిణీ, బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలు అద్భుత ఫలితాలను సాధిస్తూ యావద్దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.

పెరిగిన అవసరాలకు తగినట్లుగా హైదరాబాద్ నగరం నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించుకుంటున్నాం. వరంగల్ నగరంలో 1100 కోట్లతో రెండువేలకు పైగా పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. మరో 2 వేల పడకల ఏర్పాటుతో ‘‘నిమ్స్’’ను విస్తరించు కుంటున్నాం. ఇందుకోసమై నిర్మించే నూతన భవనానికి ఈ మధ్యే నేను శంకుస్థాపన చేశాను. 108, 104 సేవలను పెంచాలనే ఉద్దేశంతో ఇటీవలనే కొత్తగా 466 వాహన సేవలను ప్రారంభించుకున్నాం. ఫోన్ చేసిన 15 నిముషాల లోపు ఈ వాహనాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చి సేవలందిస్తున్నాయి.

◆ అనాథల పిల్లలకు అండదండలు

60 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక విధానమంటూ లేకపోవడం అత్యంత విషాదకరం. పరిపాలనలో మానవీయ పరిమళాలు వెదజల్లుతున్న తెలంగాణ ప్రభుత్వం అనాథల పిల్లల సంరక్షణ బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించింది. వారిని “స్టేట్ చిల్డ్రన్” గా పేర్కొంటూ ఉన్నతమైన, ఉదాత్తమైన పద్ధతిలో “Orphan Policy” రూపొందించింది. ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే అక్కున చేర్చుకుంటుంది. ముఖ్యంగా అనాథలైన ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంతోపాటు, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవరకూ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.

◆ ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాలకన్నా ఎంతో ముందున్నది. నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇచ్చుకున్నం. ఇప్పటివరకూ రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ అందించుకున్నం. కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపచేసింది. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించాను.

గత ప్రభుత్వాలు నష్టాలపాలు చేసిన సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దింది. కంపెనీ టర్నోవర్ ను 12 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెంచింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్ గా వెయ్యి కోట్లు పంపిణీ చేయబోతున్నదని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.

◆ వీ.ఆర్.ఏ.లకు పేస్కేల్

నీరటి, మస్కూరీ, లష్కర్ వంటి కాలంచెల్లిన పేర్లతో పిలవబడుతూ, ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా మిగిలిన వీ.ఆర్.ఏ.లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కలిగించింది తెలంగాణ ప్రభుత్వం. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పేస్కేలు అమలు చేసింది. వీరందరినీ విద్యార్హతలు, సామర్ధ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరుచేసింది.

◆ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పుచెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిచెందేలా పంచాయతీ కార్యదర్శులు ద్విగుణీకృత ఉత్సాహంతో నిరంతర కృషిని కొనసాగించాలని కోరుతున్నాను.

◆ హైదరాబాద్ అభివృద్ధి

హైదరాబాద్ నలుమూలలకు మెట్రో విశ్వనగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించి, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 67 వేల 149 కోట్ల రూపాయల వ్యయంతో స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నది. ఎస్సార్డీపీ కింద 42 కీలక రహదారులు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్వోబీల అభివృద్ధిని చేపట్టింది. వీటిలో చాలాభాగం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 275 కోట్ల రూపాయలతో 22 లింక్ రోడ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం పూర్తిచేసింది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులకూ మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 69 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయపరచి ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అన్ని జంక్షన్ల నుంచి పైదరాబాద్ ను అనుసంధానం చేస్తూ, నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకొనే విధంగా మెట్రో రైలును విస్తరించాలని ప్రణాళిక రూపొందించింది. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తిచేయాలనే లక్ష్యం నిర్దేశించింది.కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్ లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుంది.

◆ పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి

పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో నేడు తెలంగాణ గ్రామాలు, పట్టణాలు చక్కని మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో అలరారుతున్నాయి. మన గ్రామాలు, పట్టణాలు దేశస్థాయిలో మన రాష్ట్రానికి కీర్తి ప్రతిష్టలను చేకూర్చి పెడుతున్నాయి. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదుగా 13 జాతీయ అవార్డులను మన స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.

◆ విద్యారంగ వికాసం

దేశవ్యాప్తంగా చూస్తే, గురుకుల విద్యలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రం మరొకటి లేదు. రాష్ట్రంలో నేడు వెయ్యికి పైబడి గురుకుల జూనియర్ కళాశాలలు కొలువుదీరటం బి.ఆర్.ఎస్. ప్రభుత్వం సృష్టించిన నూతన చరిత్ర. భావి భారత పౌరులు బలంగా ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం హాస్టళ్లలోనూ, మధ్యాహ్న భోజన పథకం కింద అన్ని పాఠశాలలలోనూ విద్యార్థినీ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నది. హస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను సైతం పెంచింది.

మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి పేరుతో ప్రభుత్వం రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నది. ప్రభుత్వం తీసుకున్న వివిధ ప్రోత్సాహక చర్యలతో రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు ఉత్తీర్ణతలో మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. డబ్బులేని కారణంగా పేద విద్యార్థులెవరూ ఉన్నత విద్యకు దూరం కావద్దనే ఉదాత్తలక్ష్యంతో ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఓవర్సీస్ స్కాలర్ షిప్ ను అందిస్తున్నది. నేడు వేలాదిమంది విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో వివిధ దేశాలలో ఉన్నతమైన చదువులు చదువుకోవడం ప్రభుత్వ సంకల్ప సిద్ధికి నిదర్శనం.

◆ ప్రజలకు చేరువగా పాలన

పరిపాలనను వికేంద్రీకరించి ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం పాలనా సంస్కరణలు చేపట్టింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాలలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్లు నిర్మించింది. గిరిజనుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామపంచాయతీ హోదా కల్పించింది.

◆ పారిశ్రామిక, ఐటీ రంగాల్లో తెలంగాణ మేటి

పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. దీనికితోడు 24 గంటల నిరంతర విద్యుత్తు పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజాన్ని నెలకొల్పింది. నేడు తెలంగాణ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా, పరిశ్రమలకు స్వర్గధామంగా మారింది. 2 లక్షల 51 వేల కోట్ల పెట్టుబడులతో రాష్ర్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేండ్లలో 17 లక్షల 21 వేల మందికి ఉపాధి లభించింది.
ఐటీ రంగంలోనూ తెలంగాణ మేటిగా నిలుస్తున్నది. తెలంగాణ ఏర్పడేనాటికి రాష్ట్రంలో 3 లక్షల 23 వేల 39 మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2014 నాటికి ఐటీ ఎగుమతులు 57 వేల 258 కోట్ల రూపాయలు కాగా, 2014 నుంచి 2023 నాటికి 2 లక్షల 41 వేల 275 కోట్లకు పెరిగాయి. ఐటీ రంగాన్ని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్ధిపేట వంటి ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరింపజేస్తూ, ప్రభుత్వం ఐటీ టవర్స్ ను నిర్మించింది. తద్వారా గతానికి భిన్నంగా అభివృద్ధిని సైతం వికేంద్రీకరిస్తున్నది.

◆ పేదరికం తగ్గుముఖం

“సంపద పెంచు – ప్రజలకు పంచు’’ అనే సదాశయంతో “తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్నదనీ, తలసరి ఆదాయం పెరుగుతున్నదనీ” నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసింది. జాతీయ స్థాయిలో నమోదయిన సగటు పేదరికంతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైంది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. అంటే, ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధిని సాధిస్తూ పురోగమిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోనూ, నగర ప్రాంతాల్లోనూ ఏకకాలంలో మౌలిక వసతుల కల్పన చేస్తూ సమగ్ర దృక్పథాన్ని అవలంబిస్తున్నది. దళిత బడుగు, బలహీన వర్గాలు, రైతాంగం మొదలుకొని అగ్రవర్ణ పేదల వరకూ అందరికీ సంక్షేమ ఫలాలను అందజేస్తూ, సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తున్నది. వికేంద్రీకరణను ఒక విలువగా పాటిస్తూ పరిపాలనలో సంస్కరణలు చేసింది. అదే విధంగా పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నది. అభివృద్ధికి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యతనిస్తూ పేదవర్గాలను ఆదుకుంటున్నది. అందుకే నేడు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తెలంగాణ అభివృద్ధి నమూనాకు జై కొడుతున్నారు. అతి పిన్న రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి మోడల్ గురించి ఇప్పుడు దేశమంతటా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉండటం మనందరికీ గర్వకారణం. ఇది తెలంగాణ ప్రభుత్వ ప్రతిభకూ, పటిమకూ తిరుగులేని నిదర్శనం.
మీ అందరికీ మరోమారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తినీ, విలువలను ముందుకు తీసుకుపోయే క్రమంలో యావత్ భారతజాతి ఒక్కటిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను.తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సమాపన వేడుకలను విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తూ ముగిస్తున్నాను.