విద్యా రంగం మీద సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ విద్యా రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని, ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టాలని విద్యా శాఖ అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి విద్యా రంగంపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

కళాశాల, ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన, ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ లతో కలిసి సీఎం గురువారం విద్యా రంగంపై సమీక్షించారు

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కేజీ టు పీజీలో ఉచిత విద్య పై తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. విద్యా శాఖలోని అన్ని స్థాయిల్లో ఖాళీల పై చర్చించారు. పాఠశాల విద్యా విభాగంలో దాదాపు 22 వేల ఖాళీలు, ఉన్నత విద్య పరిధిలో దాదాపు వెయ్యి వరకూ ఖాళీలున్నాయని వివరించారు. ఖాళీల భర్తీపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎం సంకేతాలు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఇంటర్మీడియెట్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు పెరిగాయని, సిలబస్‌ దాదాపు పూర్తవబోతోందని అధికారులు తెలిపారు.

 జాతీయ, అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా ఉన్నత విద్యలో మార్పులు తేవాలని సీఎం ఆకాంక్షించినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఏ జిల్లాలో ఎన్ని కళాశాలలున్నాయి? వాటి పరిస్థితి ఏమిటి? ఎలాంటి మార్పులు తీసుకురావలసిన అవసరం ఉందో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం కోరినట్టు తెలిసింది.

Follow Us @