అన్ని సంఘాలు ఒప్పుకున్న కదలని బదిలీల ఫైల్.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు 13 సంవత్సరాలుగా బదిలీలు లేక తీవ్ర ఒత్తిడితో తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవతో బదిలీల అంశం సీఎం దృష్టికి వెళ్లి బదిలీలపై సీఎం కేసీఆర్ సానుకూల ప్రకటన చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట.

దేవుడు వరమిచ్చినా పూజారి కనుకరించక పోవడం అంటే ఇదేనేమో అని వేలాదిమంది బదిలీ అవసరం ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు నిర్దిష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసి వీలైనంత త్వరగా బదిలీలు చేపట్టాలని బదిలీ బాధితులు కోరుతున్నారు.

ఒకవైపు కేసీఆర్ టీఎన్జీవో, టీజీవో సంఘాలతో సమావేశమైన నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను జనవరి నెలాఖరులోగా పరిష్కరించాలని స్పష్టంగా అధికారులను ఆదేశించారు. పదోన్నతులు, బదిలీలు వంటి అంశాలను పరిష్కరించి నిరుద్యోగులు కొరకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తున్నది ప్రభుత్వం. ఇలాంటి తరుణంలో సీఎం స్వయంగా ప్రకటన చేసిన జూనియర్ అధ్యాపకుల బదిలీల అంశం నెలలు గడుస్తున్నా ఒక కొలిక్కి రాకపోవడం అధికారుల నిర్లక్ష్యం అని పలు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

హనుమంతుడి పెళ్లి ఎప్పుడు అంటే రేపు అన్నట్లు అధికారులను కలిసిన ప్రతి సారి మార్గదర్శకాలు తయారవుతున్నాయి, త్వరలో విడుదల చేస్తామని దాటవేత సమాధానాలను గత 50 రోజులుగా వింటూనే ఉన్న నేపథ్యంలో బదిలీలు మార్గదర్శకాలు త్వరగా విడుదల చేయాలని వేలాది మంది కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు.

సీఎం ప్రకటన తర్వాత కరోనా సమయంలో కూడా వేలాది మంది కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులు హైదరాబాద్ కు తరలి వచ్చి నాంపల్లి లోనో ఇంటర్ కమీషనరేట్ ఆవరణలో కేసీఆర్ చిత్రపటానికి మహా పాలాభిషేకం చేసిన విషయం తెలిసిందే. అయినా వేలాది మంది బదిలీ ఆర్తనాదాలు అధికారులకు వినపడకపోవడం ఆశ్చర్యం.

మొన్నటిదాకా సంఘాల మద్య ఏకాభిప్రాయం లేదు అని ఫైల్ ను తొక్కి పెట్టిన అధికారులు, ఇప్పుడు అన్ని సంఘాలు బదిలీల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు బదిలీల మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంలోని లోగుట్టు పెరుమాళ్ళు కే తెలవాలి. అసలు బదిలీలు చేస్తారా లేదా అనే సందిగ్ధంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు పడిపోయిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.

ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేని కేవలం మానవత్వంతో ఆలోచించి చేయాల్సిన బదిలీల పైనే ఇంత సమయం తీసుకుంటున్న అధికారులు దానికి గల కారణాలను మాత్రం స్పష్టంగా చెప్పలేక పోవడం వారి ఉదాసీన వైఖరికి నిదర్శనంగా కనబడుతుంది.

Follow Us@