Home > EMPLOYEES NEWS > చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాల్సిందే – సుప్రీంకోర్ట్

చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాల్సిందే – సుప్రీంకోర్ట్

BIKKI NEWS (APRIL 24) : దివ్యాంగులైన పిల్లల సంరక్షణ కోసం తల్లులకు ఛైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ను (Child care leaves for physically challenged children says supreme court) నిరాకరించడం తీవ్రమైన విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సెలవులు ఇవ్వకపోవడం అంటే శ్రామిక శక్తిలో మహిళలకు సమాన భాగస్వామ్యం కల్పించాలన్న రాజ్యాంగ విధిని ప్రభుత్వం ఉల్లంఘించినట్టవుతుందని పేర్కొంది.

ఈ సెలవులు ఇవ్వడం ద్వారా మహిళలకు ఏదో ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు భావించకూడదని, అది రాజ్యాంగం ప్రకారం చేయాల్సిన కర్తవ్యం అని స్పష్టం చేసింది. ప్రభుత్వం అంటే ఆదర్శ యజమాని అని, ఈ రాజ్యాంగ విధిని మరచిపోకూడదని తెలిపింది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ మహిళకు జన్మతః జన్యుపర లోపాలు ఉన్న కుమారుడు జన్మించాడు. దాంతో పుట్టినప్పటి నుంచే పలు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం ఆమె సెలవులు అన్నింటినీ వాడేశారు. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ రూల్స్‌ ప్రకారం ఆమెకు ఛైల్డ్‌ కేర్‌ లీవ్స్‌ (CCL) ఇవ్వాల్సి ఉండగా సంబంధిత అధికారులు నిరాకరించారు. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్టీవాలాల ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి సందర్భాల్లో సీసీఎల్‌లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించింది. సెలవులు నిరాకరిస్తే ఆమె ఉద్యోగాన్ని విడిచిపెటాల్సిన పరిస్థితి వస్తుందని, అలాంటప్పుడు మరిన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మహిళ-శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండాలని సూచించింది. జులై 31లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుతాన్ని పార్టీగా చేర్చాలని సూచించింది.