కరీంనగర్ (జూలై – 26) : భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగష్టు 8 నుండి 22 ఆగస్టు వరకు “స్వతంత్ర భారత వజ్రోత్సవాలు” నిర్వహించాలని కెసిఆర్ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా. తిరుపతి పోతరవేణి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘకాలం సాగిన భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలోకి తొంగిచూస్తే అడుగడుగునా ప్రజల ఆర్తనాదాలు, ఆక్రందనలు వినిపిస్తాయి. తమ తరువాతి తరాల వారైనా హాయిగా ఆనందంగా బతకాలని, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనుభవించాలని నిరంతరం తపించి ఉద్యమించి, వారు చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు అనన్యసామాన్యమైనవి. భార్యాబిడ్డలను వదిలేసి ఏళ్ళకు ఏళ్ళు జైళ్లలో మగ్గిపోయిన త్యాగమూర్తులు, జైలుగోడల మధ్య పాచిపట్టిన అన్నం తినలేక రోజుల తరబడి పస్తులున్నవారు, ఆకలికి తట్టుకోలేక పురుగులు పట్టిన అన్నం ఏరుకొని ఆబగా తిన్నవారు ఎందరో. తెల్లవాడిని నెదిరించి నవ్వుతూ ఉరికంబాలపై వేలాడిన యోధులు ఎందరో. దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వాన్ని ధారబోసినవారు ఎందరో అలాంటివారిని గూర్చి, సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గిపోయిన పోరాట యోధుల గూర్చి ఈ స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు సందర్బంగా నెమరు వేసుకొని, ఆ యోధుల గూర్చి ఈ తరం వారికి తెలియజెప్పే అవకాశం ఉంటుంది.
అంతేకాక ఇప్పుడు మనం పీలుస్తున్న స్వేచ్ఛావాయువులు లక్షలాది మంది సమరయోధులు అర్పించిన ప్రాణత్యాగాల ఫలితమేనని, సమరయోధుల త్యాగాలు పాఠాల రూపంలో పిల్లలకు చేరువైతే స్వేచ్ఛా స్వాతంత్ర్యాల విలువ, ప్రాధాన్యత విద్యార్థులకు, యువతకు అర్థమవుతాయన్నారు. అప్పుడే ఛిద్రమైపోతున్న మానవ విలువలను, పతనమైపోతున్న ప్రజాస్వామిక విలువలను కొంతమేరకైనా కాపాడిన వారమవుతమన్నారు. కాబట్టి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభసందర్బంగా కెసిఆర్ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహణతోపాటు నర్సరి నుండి పీజీ వరకు విద్యా భోధనలో చరిత్ర సబ్జెక్టును తప్పసరి చేస్తేనే నిజమైన నివాళులు అర్పించినట్లు అని సూచించారు.
హర్షం వ్యక్తం చేసిన వారిలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు డా. యస్. తిరుపతి సుదర్శన్, కుందారపు సతీష్, రామ్, రమేష్, నరేష్, చంద్ర మోహన్ తదితరులు ఉన్నారు.
Follow Us @