Home > EMPLOYEES NEWS > 317 GO – 317, 46 జీవోలపై మంత్రివర్గ ఉప సంఘం

317 GO – 317, 46 జీవోలపై మంత్రివర్గ ఉప సంఘం

BIKKI NEWS (FEB. 25) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న 317, 46 జీవోలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని (cabinate sub committee on 317 And 46 GOs) ఏర్పాటు చేసింది.

మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా ఏర్పాటైన ఉప సంఘంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను సభ్యులుగా నియమించింది. ఈ జీవోల పర్యవసానాలను పరిశీలించి ప్రభుత్వానికి ఉపసంఘం నివేదిక సమర్పించనుంది.

ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీల సమస్య కొంతలో కొంతైనా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. 2021 డిసెంబరు 6న 317 జీవో, 2022 ఏప్రిల్‌ 4న 46జీవోను జారీ చేశారు. వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌గా సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) కార్యదర్శి వ్యవహరించనున్నారు.

★ 317 జీవో వివాదం

గత ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణతో రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల ఆధారంగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టేందుకు 317 జీవోను జారీ చేశారు. అయితే ఇది తీవ్ర వివాదాస్పదమైంది. కొత్త జిల్లాలకు సిబ్బందిని సర్దుబాటు చేసే క్రమంలో ప్రభుత్వం పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులను వివిధ జిల్లాలకు కేటాయించారు. దాదాపు 30వేల మందిని బదిలీ చేశారు. ఈ సర్దుబాటు సక్రమంగా జరగలేదని, జూనియర్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారంటూ అప్పట్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి.

స్థానికత ఆధారంగా సొంత జిల్లాలను కేటాయించాలని డిమాండ్‌ చేశాయి. ఈ బదిలీల సందర్భంగా కనీసం స్పౌజ్‌ కేసులను కూడా పట్టించుకోలేదని, బదిలీ అయినవారిలో సగం మందికి అన్యాయం జరిగిందంటూ సంఘాలు ఆరోపించాయి. దీంతో ప్రభుత్వం దిగొచ్చి భార్యాభర్తల కేసులను పరిష్కరించింది. అయితే 13జిల్లాల స్పౌజ్‌ కేసులను పరిష్కరించలేదు. ఇప్పటికీ భార్య ఒక చోట, భర్త మరో చోట పని చేయాల్సి వస్తోందని సంఘాలు అంటున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇది తమ పదోన్నతులపై తీవ్ర ప్రభావం చూపిందని ఉద్యోగులు అంటున్నారు. ఇప్పటికీ ఈ సమస్య రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.