BIKKI NEWS (JAN. 16) : ఎటువంటి ఛార్జింగ్ అవసరం లేకుండా.. 50 ఏండ్ల పాటు శక్తిని ఉత్పత్తి చేసే అణుధార్మికత బ్యాటరీని (betavolt battery BV100) చైనాకు చెందిన బెటావోల్ట్ అనే కంపెనీ తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను సదరు సంస్థ ఇటీవలే వెల్లడించింది.
బీజింగ్‌కు చెందిన బీటావోల్ట్ అనే ఓ స్టార్టప్ కంపెనీ ఓ న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది. BV100 పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ బ్యాటరీ పరిమాణం ఓ కాయిన్ కంటే చిన్నదిగా ఉంటుంది. నికెల్-63 ఐసోటోప్, డైమండ్ సెమీ కండక్టర్‌లతో దీన్ని రూపొందిస్తున్నారు. 3 వోల్టుల వద్ద ఇది 100 మైక్రోవాట్ల శక్తిని విడుదల చేస్తుంది. 2025 నాటికి దీన్ని ఒక వాట్ ఉత్పత్తి చేసే లక్ష్యంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అణుశక్తిని అత్యంత సూక్ష్మీకరణ చేసి అభివృద్ధి చేసిన ఈ తరహా బ్యాటరీ ప్రపంచంలోనే మొదటిదని బీటావోల్ట్ వెల్లడించింది.
ఇది ప్రస్తుతం పరీక్షల దశలో ఉందని తెలిపింది. ఇక బ్యాటరీలో నుంచి వచ్చే రేడియేషన్ మానవ శరీరానికి ఎలాంటి హాని కలిగించదని స్పష్టం చేసింది. పరీక్షల అనంతరం దీన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు బీటావోల్ట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ బ్యాటరీ ఒక లేయర్‌ను కలిగి ఉంటుందని, ఇది ఆకస్మిక శక్తి కారణంగా సంభవించే మంటలను, పేలుడును నిరోధిస్తుందని బీటావోల్ట్ తెలిపింది. మైనస్ 60 డిగ్రీల సెల్సియస్ నుండి 120 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న ఉష్ణోగ్రతలలో బ్యాటరీ పని చేయగలదని బీటావోల్ట్ పేర్కొంది.