ఉద్యోగులకు ఉత్తమ పీఆర్సీ – CM KCR

హైదరాబాద్ (ఆగస్టు – 15) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాలకన్నా ఎంతో ముందున్నది. నేడు దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వోద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంటు ఇచ్చుకున్నం. ఇప్పటివరకూ రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ అందించుకున్నం. కరోనా విజృంభణ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపించిన తరుణంలోనూ ఉద్యోగులకు మెరుగైన ఫిట్ మెంట్ నే అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగులతోపాటుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం వేతనాల పెంపుదలను వర్తింపచేసింది. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించాను.

గత ప్రభుత్వాలు నష్టాలపాలు చేసిన సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదిద్దింది. కంపెనీ టర్నోవర్ ను 12 వేల కోట్ల నుంచి 33 వేల కోట్లకు పెంచింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్ గా వెయ్యి కోట్లు పంపిణీ చేయబోతున్నదని తెలియజేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.

◆ వీ.ఆర్.ఏ.లకు పేస్కేల్

నీరటి, మస్కూరీ, లష్కర్ వంటి కాలంచెల్లిన పేర్లతో పిలవబడుతూ, ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా మిగిలిన వీ.ఆర్.ఏ.లకు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతిపత్తిని కలిగించింది తెలంగాణ ప్రభుత్వం. వీరి సేవలను క్రమబద్ధీకరిస్తూ పేస్కేలు అమలు చేసింది. వీరందరినీ విద్యార్హతలు, సామర్ధ్యాలను బట్టి ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా 14,954 పోస్టులను మంజూరుచేసింది.

◆ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ

గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను కూడా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పుచెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిచెందేలా పంచాయతీ కార్యదర్శులు ద్విగుణీకృత ఉత్సాహంతో నిరంతర కృషిని కొనసాగించాలని కోరుతున్నాను.