ARTICLE 370 – ఆర్టికల్ 370 పూర్తి సమాచారం

BIKKI NEWS : ఆర్టికల్ 370 (Article 370 full history in telugu) ప్రకారం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా ఉంటుంది. ప్రత్యేక రాజ్యాంగం, రాష్ట్ర పతాకం ఉంటాయి. అంతర్గత పాలన విషయంలో పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కాశ్మీర్ పై భారత సార్వభౌమాధికారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల వరకే పరిమితం.

Article 370 full history in telugu

ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూ కశ్మీర్ లో ఆస్తులు, భూములు కొనుగోలు చేయలేరు.

ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం మిగతా ప్రాంతాల వారికంటే భిన్నంగా ఉంటుంది.

అక్కడ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం కేంద్రానికి లేదు. రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్లు మినహా ఇతర చట్టాల అమలుకు అక్కడి రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి.

ఆర్టికల్ 370ని సవరించే, రద్దు చేసే అధికారం రాజ్యాంగ అసెంబ్లీకి ఉంది. కానీ రాజ్యాంగ అసెంబ్లీయే 1957లో రద్దయిపోయింది.

దాంతో ఆర్టికల్ 370 రాజ్యాంగంలో శాశ్వత భాగమైయిందని, దాని రద్దు అధికారం కేంద్రానికి లేదని అక్కడి పార్టీలు వాదిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. సుప్రీం తాజాగా రద్దును సమర్దించింది.

★ ఆర్టికల్ అమలు నుంచి రద్దు వరకు

1947 అక్టోబర్ 26: భారతదేశ విభజన తర్వాత జమ్మూకశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండడానికే మహారాజా హరిసింగ్ మొగ్గు చూపారు. భారత్ లో గానీ, పాకిస్తాన్ లో గానీ విలీనం కాబోమని ప్రకటించారు. ఇంతలో పాకిస్తాన్ సైన్యం అండతో అక్కడి గిరిజనులు జమ్మూకశ్మీర్ పై దండెత్తారు. మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వ సహకారాన్ని కోరారు. భారత్ లో విలీనానికి అంగీకరించారు. కొన్ని షరతులతో విలీన ఒప్పందంపై సంతకం చేశారు.

1949 మే 27: రాజ్యాంగాన్ని రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 370 ముసాయిదాను ఆమోదించింది.

1949 అక్టోబర్ 17: జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారు.

1951 మే 1: జమ్మూకశ్మీర్ లో రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ రాజకుమారుడు డాక్టర్ కరణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

1952 ఇండియా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ‘ఢిల్లీ అగ్రిమెంట్’పై భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, జమ్మూ కశ్మీర్ ప్రధాన మంత్రి షేక్ అబ్దుల్లా సంతకం చేశారు.


1954 మే 14: రాష్ట్రపత్తి ఉత్తర్వు మేరకు ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది.

1954 మే 15: జమ్మూకశ్మీర్ లో శాశ్వత నివాసితుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు రక్షణ కల్పించడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ‘ఆర్టికల్ 35’ను భారత రాజ్యాంగంలో చేర్చారు.

1957 నవంబర్ 17: జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని ఆమోదించారు.

1958 జనవరి 26: జమ్మూకశ్మీర్ కు సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

1965: జమ్మూకశ్మీర్ లో ప్రధానమంత్రి, సదర్-ఇ-రియాసత్ పదవులను ముఖ్యమంత్రి, గవర్నర్ అధికారికంగా మార్చారు.

2018 డిసెంబర్ 20: జమ్మూకశ్మీర్ లో రాష్ట్రపతి పాలన విధించారు.

2019 జూలై 3: రాష్ట్రపతి పాలనను మరోసారి పొడిగించారు.

2019 ఆగస్టు 5: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

2019 ఆగస్టు 6: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ అడ్వొకేట్ ఎం. ఎల్. శర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

2019 ఆగస్టు 9: జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం – 2019ను పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.

2019 సెప్టెంబర్ 19: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కోసం ఐదుగురు
న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

2023 ఆగస్టు 2: పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మొదలైంది.

2023 సెప్టెంబర్ 5: మొత్తం 23 పిటిషన్లపై ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది.

2023 డిసెంబర్ 11: ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు