BIKKI NEWS : శారీరక వైకల్యాన్ని శరీరానికే పరిమితం చేసి మనసుకు రెక్కలు కట్టుకుని ఎగిరే దివ్యాంగులు ఎందరో… అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా మానసికంగా బలహీనులై కృంగి కృశించి పోయో వారెందరో ఉన్న ఈ లోకంలో మానసిక బలంతో పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని జయించి పీజీ వరకు ఉన్నత చదువులు చదివి, సంవత్సరానికి వందలాది మంది విద్యార్థులకు విద్యాబోధన చేసే గురువు స్థానంలో నిలిచిన అంధ అధ్యాపకుడు అనిల్ రెడ్డి విజయ గాధ అందరికి ఆదర్శం…
చదవాలంటే కళ్ళు ఎంత అవసరమో తెలుసు కానీ పుట్టుకతోనే కంటి చూపు లేని అనిల్ రెడ్డి ఆ చదువుని జయించి, అనేక మంది విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ కరోనా కాలంలో ఇంటర్మీడియట్ బోర్డు తరపున డీడీ యాదగిరిలో ఇప్పటికే 100 ఆన్లైన్ తరగతులు బోధించి డిజిటల్ గురువు స్థానంలో కూడా నిటారుగా నిలబడటం అతని పట్టుదలకు, మానసిక దృడత్వానికి నిదర్శనం అందుకే అనిల్ రెడ్డి ది గ్రేట్.
● డిజిటల్ గురువు – కాంట్రాక్ట్ అధ్యాపకుడు అనిల్ రెడ్డి
కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడడంతో పేద విద్యార్థులకు నష్టపోకుండా ఆన్లైన్ తరగతులను నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిడి యాదగిరి ఛానల్ నందు డిజిటల్ తరగతులను సెప్టెంబరు ఒకటి నుండి ప్రసారం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పౌర శాస్త్రం సబ్జెక్టును బోధిస్తున్న అంధుడైన కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుడు అనిల్ రెడ్డి డిజిటల్ తరగతుల కార్యక్రమంలో తమ వంతు పాత్రకై నడుంబిగించారు. టెక్నాలజీ, కంప్యూటర్ లో కూడా మంచి పట్టు ఉన్న అనిల్ రెడ్డి ఆన్లైన్ తరగతులు బోధించడానికి సొంతంగా JAWS & NVDA స్క్రీన్ రీడర్స్ సహయంతో ఇంగ్లీష్ & తెలుగు మీడియం నోట్స్ తయారుచేసుకోవడం విశేషం
పౌరశాస్త్రం సబ్జెక్టు నిపుణుడు అయిన కాంట్రాక్ట్ అధ్యాపకుడు అనిల్ రెడ్డి 100 డిజిటల్ తరగతులను పూర్తి చేయటం యాదగిరి ఛానల్ లో అవి ప్రసారం కావడం విశేషం. ఇంటర్మీడియట్ విద్యలో అనిల్ రెడ్డి సేవలను గుర్తింపుకు ప్రతిభా అవార్డు కూడా లభించింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు,తోటి అధ్యాపకులు అనిల్ రెడ్డిని అభినందించారు.
● అనిల్ రెడ్డి గురించి ::
నా పేరు అనిల్ రెడ్డి నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కాచిగూడ లో రాజనీతి శాస్త్రం అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. నాకు రెండు కళ్లు కనిపించవు.
మా అమ్మ నాన్నల పోత్సహంతో నేను Devnar స్కూల్ ఫర్ ది బ్లైండ్ బేగంపేట్ లో స్కూలింగ్ అంతా చేశాను. తర్వాత న్యూ మోడల్ జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చేశాను. నిజాం కాలేజ్ లో డిగ్రీ చేశాను. పీజీలో పొలిటికల్ సైన్స్ ను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పూర్తి చేశాను.
2011 నుంచి జూనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నాను. ఇటీవల కరోనా వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రావడం జరిగింది దానిలో భాగంగా ఆన్లైన్ తరగతులు అనేవి మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు తలపెట్టడం జరిగింది.
● ఇంటర్మీడియట్ కమీషనర్ కి కృతజ్ఞతలు
డీడీ యాదగిరిలో ప్రసారమయ్యె ఇంటర్మీడియట్ డిజిటల్ తరగతులలో భాగంగా నాకు ఆన్లైన్ క్లాసులు చెప్పే అవకాశం లభించింది. దీనికి మన కమిషనర్ గారికి అలాగే ఆన్లైన్ తరగతులు ప్రసారం చేయడానికి కృషి చేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతున్నాను.
నేను రికార్డ్ చేసినటువంటి ప్రతి క్లాస్ కూడా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో బోధించడం జరిగింది. అది కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పిల్లలకి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుందన్న ఉద్దేశంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రతి వీడియో లో కూడా ఉపయోగించటం జరిగింది.
ఈ స్థాయికి రావడానికి కారణం అయినటువంటి మా పేరెంట్స్, భార్య, కుటుంబ సభ్యులు, టీచర్లు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా ధన్యవాదాలు.
● దివ్యాంగులను పోత్సహించాలి ::
నా ప్రతిభను గుర్తించి ఈ స్థాయికి తీసుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఇంకా మునుముందు కూడా నాలాంటి వాళ్ళు ఎవరైనా దివ్యాంగులు ఉంటే వాళ్ళని కూడా ప్రోత్సహించాలని.. మాలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే మేము కూడా ఇతరులతో పాటు సమానంగా ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను.