VIVEKANANDA : సమతా వైతాళికుడు – అస్నాల శ్రీనివాస్‌

  • జనవరి – 12 వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం
  • అస్నాల శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్. ప్రభుత్వ జూనియర్ కళాశాల, సమ్మక్క సారక్క తాడ్వాయి ములుగు (తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం)

BIKKI NEWS : ‘‘పేదవాని కష్టముతో పైకి వచ్చి వారి బాగోగులను పట్టించుకొని ప్రతివాడు దేశద్రోహి, పీడకులు నైతికంగా, భౌతికంగా మరణించారు. సంపద సృష్టికర్తలైన శ్రామికులే ఈ దేశ ఆశాకిరణాలు” ఈ వ్యాఖ్యలు చదువగానే వర్గ సంఘర్షణ సిద్దాంతాన్ని ప్రభోధించిన కార్ల్‌మార్క్స్‌ లేదా అతను ప్రతిపాదించిన మార్గములో నూతన ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మిస్తామనే విప్లవకారులు చేసినవి అని అనుకుంటారు. జడప్రాయంగా ఉన్న సమాజాన్ని మృతప్రాయంగా ఉన్న వ్యవస్థకు కొత్త ఊపిరిపోసి, క్రొత్త నెత్తురు ఎక్కించిన పునరుజ్జీవన, జాతీయోద్యమ, విప్లవోద్యమ కేంద్రస్థానమైన బెంగాల్‌ మాగాణంలో ఉద్భవించిన వివేకానందుడు చేసిన వాఖ్యానాలు. 18, 19వ శతాబ్దాలలో స్తబ్ధమైన భారతీయ సమాజాన్ని మేల్కోల్పడానికి రాజారామ్‌మోహన్‌రాయ్‌, కేశవచంద్రసేన్‌, దయానంద సరస్వతి సారధ్యంలో కొనసాగిన సంస్కరణోద్యమాన్ని వివేకానందుడు గొప్ప ముందడుగు వేయించాడు. నునులేత యవ్వనంలో విప్లవ రాజకీయాల వైపు ఉద్యుక్తుడైన, సంయమనంతో శతబ్దాలుగా అజ్ఞానంలో మగ్గుతున్న భారతావనిపై జ్ఞాన రేఖలు ప్రసరింపచేయాని తక్షణ కర్తవ్యంగా భావించాడు. జ్ఞానపిపాసనే మోక్షానికి సాధన అన్న ఉపనిషత్తులను హేతువాదం, వివేకం, మానవవాదాలను హృదయంగా ఉన్న బౌద్దమును, అనేక పశ్చిమ దర్శనాలను స్పూర్తిగా తీసుకొని స్పష్టమైన దృక్పదంతో కార్యచరణతో సమత జ్ఞాన విప్లవాన్ని ఆరంభించాడు. (Vivekananda jayanthi) (National Youth Day )

‘‘పేదవాని కష్టముతో పైకి వచ్చి వారి బాగోగులను పట్టించుకొని ప్రతివాడు దేశద్రోహి, పీడకులు నైతికంగా, భౌతికంగా మరణించారు. సంపద సృష్టికర్తలైన శ్రామికులే ఈ దేశ ఆశాకిరణాలు”అస్నాల శ్రీనివాస్

1863 జనవరి 12న కలకత్తా నగరంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. బాల్యం నుండే విద్యా, క్రీడల్లో చురుకుగా రాణించాడు. 1883లో కలకత్తా ప్రెసిడెన్సి కాలేజీ నుండి పట్టభద్ర పట్టా పుచ్చుకున్నాడు. తత్వ శాస్త్రంపై ఇష్టంతో పాశ్చత్య తత్వ చింతనపరులైన జాన్‌ స్టువర్ట్‌మిల్‌, హెర్బర్ట్‌ స్పెన్సర్‌, హెగల్‌ రచనలను అధ్యయనం చేసాడు. కేశవచంద్ర సేన్‌ సారధ్యములోని బ్రహ్మసమాజంలో కొంత కాలము పనిచేసాడు. తనలో తీవ్రమవుతున్న జ్ఞాన పిపాసకు, దైవము, మానవ సమాజంపై వస్తున్న అనేక సందేహాలను ‘‘మానవ సేవయే మాధవసేవ’’ యని ప్రవచించిన రామకృష్ణ పరమహంస దగ్గర నివృత్తి చేసుకొని, ఆయన శిష్యుడిగా మారాడు.

ఇనుప నరాలు, ఉక్కు కండరాలు ఉన్న యువతరాన్ని తన ప్రసంగాల ద్వారా కదిలి రమ్ము అని వారి జడత్వాన్ని వదిలించాడు వివేకానంద – అస్నాల శ్రీనివాస్

ప్రజల మధ్య జీవించి వారి కష్టసుఖాలను తెసుకొని, వారిని బాధ నుండి విముక్తి చేసేవారే చరిత్రలో నిర్మాత్ములుగా, తత్వవేత్తలుగా మిగిలిపోతారు. ఈ వెలుగులో 1888 నుండి 1892 వరకు దేశమంతటా పర్యటించాడు. తన కాలపు ప్రజలు విద్యకు, విజ్ఞానానికి దూరంగా మూఢ విశ్వాసాల్లో దారుణ సాంఫీుక దురాచార కబంద హస్తాలలో నలిగిపోవడం చూశాడు. ఉపనిషత్తులు, జైన, బౌద్ధం మతాలుగా విలసిల్లి ప్రపంచానికి వెలుగు రేఖగా మారిన భారతదేశంలో ఆనాటి ఔన్నత్యము కోల్పోయిందని గ్రహించాడు. శ్రామికుల పట్ల, స్త్రీ పట్ల అంతులేని వివక్షత కొనసాగుతుందని, యువత నిస్తేజంగా మారిపోయిందని.. నైతికంగా, భౌతికంగా భారత జాతి నిర్వీర్యం అయిందని గ్రహించాడు.

1893 చికాగో నగరంలో ప్రపంచ మత సదస్సుకు హాజరై భారతీయ తత్వ సారాన్ని అద్భుత రీతిలో తెలియజేసి… ప్రపంచాన్ని అకట్టుకున్నాడు వివేకానంద – అస్నాల శ్రీనివాస్

భారతీయ మూలాల నుండి నిజమైన వేదాంత దృక్పదాన్ని రూపొందించి… జాతి, మత అన్ని రకాల ఆధిపత్యాలను రూపుమాపే ప్రజాస్వామిక సిద్ధాంతముగా మార్చాడు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు ఉన్న యువతరాన్ని ఇదే అదనుగా కదిలి రమ్ము అని తన ప్రసంగాల ద్వారా వారి జడత్వాన్ని వదిలించాడు. ఈ క్రమములో 1893 చికాగో నగరంలో ప్రపంచ మత సదస్సుకు హాజరై భారతీయ తత్వ సారాన్ని అద్భుత రీతిలో తెలియజేసి… ప్రపంచాన్ని అకట్టుకున్నాడు. 1894 నుండి1897 వరకు అనేక పశ్చిమ దేశాలు పర్యటించి వేదాంత సారాన్ని భోదిస్తూ భారతదేశాన్ని పేదరికం, అజ్ఞానము నుండి ఉద్దరించడానికి సహాయ సహకారాలను అభ్యర్థించాడు. కలకత్తా, మద్రాసులో ఆశ్రమాలను, విద్యాలయాను స్థాపించాడు.

తన జ్ఞానంతో, సమున్నత వ్యక్తిత్వంతో విద్యార్థిలో ప్రవహించినప్పుడే ఆదర్శ ఉపాధ్యాయుడు అవుతాడని, అలాంటి టీచర్లు, మానవజాతికి అత్యున్నత సంపదని వివేకానంద పేర్కొన్నాడు. – అస్నాల శ్రీనివాస్

సమస్త సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి.. సౌఖ్యమైన భౌతిక, మానసిక, వికాస జీవనానికి తోడ్పడే నాగరికత సంస్కృతులను పెంచడానికి విద్య, విముక్తి దాయినిగా పనిచేస్తుందని.. పశ్చిమ దేశాల అనుభవము నుండి గ్రహించాడు. తనదైన విద్యాతత్వ శాస్త్రమును రూపొందించి, విద్యా వ్యాప్తికి కృషి చేశాడు. మనుషులలో నిగూఢమై ఉన్న పరిపూర్ణత్వన్ని వ్యక్తం చేయించేది విద్య అని నిర్వచించాడు. జీవితాన్ని నిర్మించేది, విలువలు గల మనుషులను రూపొందించేది విద్యే అని పేర్కొన్నాడు. విద్యలో సమాన అవకాశాలను కల్పించిన ప్రాచీన నలంద, తక్షశిల, విక్రమశిల, విద్యాలయాల సుసంపన్న మహత్తర సంప్రదాయాన్ని పునఃప్రతిష్టింపచేయాలని, ప్రభుత్వము, పౌరసమాజం విద్యను అందించడమే ప్రథమ కర్తవ్యముగా చేపట్టాలని ప్రజలను చైతన్యవంతం చేశాడు. చరిత్ర, గణితం, ఖగోళశాస్త్రం, వ్యవసాయం, సాంకేతిక విద్య, సంగీతము, నృత్యము వంటి అంశాలను పాఠ్య ప్రణాళికలో ఉండాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధికర వివేవచనాయుత సమాజం నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. స్థానిక ప్రజల భాషలోనే బోధించాలని సూచించాడు. సంస్కృతంలో భారతీయ జ్ఞానం నమోదు కావడం వల్ల అది సామాన్య జనానికి చేరువ కాలేకపోయిందని తెలియజేశారు. తన జ్ఞానంతో, సమున్నత వ్యక్తిత్వంతో విద్యార్థిలో ప్రవహించినప్పుడే ఆదర్శ ఉపాధ్యాయుడు అవుతాడని, అలాంటి టీచర్లు, మానవజాతికి అత్యున్నత సంపదని పేర్కొన్నాడు.

విద్యార్థులు ధ్యానం ద్వారా ఏకాగ్రత సాధించాలని, అనుభవపూర్వక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యం సాధించే వరకు విశ్రమించకూడదని ఉత్తేజపరిచారు.అస్నాల శ్రీనివాస్

విద్యార్థులు ధ్యానం ద్వారా ఏకాగ్రత సాధించాలని, అనుభవపూర్వక జ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని లక్ష్యం సాధించేవరకు విశ్రమించకూడదని ఉత్తేజపరిచారు. ధృడమైన సునిశితమైన ఆరోగ్యమైన మేధస్సుతో యువత సామాజిక మార్పుకు చోదకశక్తిగా ఉండాని వారిని మేల్కోపుతూ పనిచేసిన వివేకానందుడు 39సం॥ వయస్సులోనే జులై- 4 – 1902లో మరణించారు.

ఆ నాటి సమాజంలో వ్యవస్థీకృతమైన రుగ్మతలను ఎదురించడం, సంస్కరించడం వంటి వివేకానందుడి విప్లవాత్మక భావాలు ఇప్పటికి ప్రాసంగికతను కలిగి ఉన్నాయి. పునరుద్దరణ, తిరోగమన, విచ్ఛిన్నకర శక్తుల సామాజిక బాధ్యత లేని పెట్టుబడుదారి శక్తుల ప్రాబల్యంతో పేదరికం, అశాంతి, అసహనం నెలకొన్న ప్రస్తుత సమాజాన్ని మానవత్వం వైపు మళ్ళించడానికి వివేకానందుని కొనసాగించడమే మార్గం.

వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్‌, 9652275560