కోవిడ్ లో మినహాయించిన వెతనానికి 6% వడ్డీ చెల్లించండి – హైకోర్టు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 21) : తెలంగాణలోని ఉద్యోగులకు కొవిడ్ సమయంలో వాయిదా వేసిన జీతాలు, పింఛన్ల మొత్తానికి 6% వడ్డీ చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది.

కొవిడ్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 50% & కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 10% వేతనాలు వాయిదా వేస్తూ ఇచ్చిన జీవోను సవాలు చేస్తూ ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఏపీలో కూడా వేతనాన్ని వాయిదా వేయడంతో 12% డిమాండ్ చేయగా 6% వడ్డీ చెల్లించాలంటూ ఏపీ వర్సెస్ డి. లక్ష్మి కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇక్కడ కూడా వాయిదా వేసిన జీతం, పింఛన్ల మొత్తానికి 6% వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.