ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పోర్టల్ – యూజీసీ చైర్మన్

సెంట్రల్ వర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీశ్ కుమార్ చెప్పారు. శుక్రవారం ‘సంవాద్’ పేరుతో యూట్యూబ్ లో నిర్వహించిన లైవ్ లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 35 శాతం ఖాళీలు ఉన్నాయని, వాటిని వీలైనంత త్వరగా నింపుతామని వెల్లడించారు.

దరఖాస్తులను కేంద్రీకృత పద్ధతిలో స్వీకరించినా, భర్తీ మాత్రం వర్సిటీలవారీగానే ఉంటుందని చెప్పారు. పోర్టల్ లో వర్సిటీలవారీగా ఖాళీల వివరాలుంటాయని, నోటిఫికేషన్ వెలువడగానే ఆటోమెటిగ్గా ఈ మెయిల్ ద్వారా అభ్యర్థులకు సమాచారం అందుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ అర్హతల మేరకు ఒకటి లేదా రెండు మూడు వర్సిటీలకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

★ త్వరలోనే సీయూఈటీ పీజీ నోటిఫికేషన్

సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)కు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయని జగదీశ్ కుమార్ చెప్పారు. త్వరలోనే సీయూఈటీ పీజీ కోర్సుల నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్ వయోపరిమితిని పెంచాలనే అంశంపై అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రిసెర్చ్ ను ప్రోత్సహించడంలో భాగంగా రిటైర్డ్ ఆచార్యుల కోసం ప్రత్యేక పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.