పాత పోస్టులకు కొత్త రోస్టర్

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ -1 సహా అన్ని ఉద్యోగాలను కొత్త రోస్టర్ విధానం ప్రకారమే భర్తీ చేయనున్నారు. కొన్ని పోస్టులకు పాత రోస్టర్ విధాపం అనుసరిస్తారనే ప్రచారంలో నిజం లేదని టీఎస్పీఎస్సీ అధికారులు స్పష్టంచేస్తున్నారు. గత మార్చి 19న జారీచేసిన జీవో- 44 ప్రకారమే రోస్టర్ విధానం అమల్లో ఉంటుందని చెప్తున్నారు.

ఈ లెక్కన గ్రూప్-1 తరహాలో అన్ని పోస్టుల్లో ప్రధాన వాటా మహిళలకే దక్కనున్నది. గతంలో టీఎస్పీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్ల విషయం లోనూ కొత్త రోస్టర్ పద్ధతినే అనుసరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జోన్లు, జిల్లాల ప్రకారం 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. స్టేట్ క్యాడర్ పోస్టులు మల్టీజోన్ గా, మల్టీజోన్ పోస్టులు జోనల్ పోస్టులుగా మారాయి. ఈ నేపథ్యంలో పాత రోస్టర్‌ను కొనసాగించడం కుదరదని అధికారులు వివరిస్తున్నారు.