కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో ప్రభుత్వ విద్య & వైద్య రంగాలు బలోపేతం

  • కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక మద్దతు సభలో పలువురు వక్తలు పిలుపు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల/ లెక్చరర్స్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయడం ద్వారా విద్యా, వైద్య రంగాలు బలోపేతం అవుతాయాని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇచ్చిన హామీని ప్రభుత్వము నిలుపుకున్నట్లయితే ప్రజలు హర్షిస్తారని అన్నారు.

ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రభుత్వ ప్రకటన మద్దతు సభ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా & వైద్య వ్యవస్థ బలోపేతానికి కాంట్రాక్టు లెక్చరర్లు, కాంట్రాక్టు మెడికల్ ఉద్యోగులు కృషి చేయాలని అన్నారు. ప్రతి అధ్యాపకుడు నిత్య విద్యార్థిగా అధ్యయనం చేస్తూ విద్యార్థులను పరిపూర్ణవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన ప్రకటనకు కట్టుబడి క్రమబద్ధీకరణ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తారని ఆశిస్తున్నామని, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. క్రమబద్ధీకరణ పూర్తయ్యేంతవరకు కాంట్రాక్టు లెక్చరర్ / ఉద్యోగులకు అండగా ఉండి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

శాసన మండలి మాజీ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు లెక్చరర్ల అనేక పోరాటాల ఫలితంగానే నేడు ప్రభుత్వం క్రమబద్ధీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ త్వరిత్తగాతిన పూర్తి చేయుటకు తనవంతు కృషి చేస్తానని అన్నారు.

ఈ క్రమబద్దీకరణ మద్దతు సభలో తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగటి నారాయణ, ఐఫెక్టో జాతీయ నాయకులు డాక్టర్ రత్న ప్రభాకర్, తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య, ఐక్య వేదిక సలహాదారులు అందే సత్యం, మాచర్ల రామకృష్ణ గౌడ్, కో కన్వీనర్ లు రమణారెడ్డి, ఉదయశ్రీ, జగన్నాధరావు, డా. వస్కుల శ్రీనివాస్, శైలజ, శోభన్ బాబు, ఉదయభాస్కర్, నవీన్ కుమార్, రాజిరెడ్డి మరియు విద్య, వైద్యశాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.