పకడ్బందీగా టెన్త్, ఇంటర్ పరీక్షలు – సబితా ఇంద్రారెడ్డి

మే నెల‌లో ప్రారంభం కాబోయే ఇంట‌ర్, టెన్త్ ఎగ్జామ్స్‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఇంట‌ర్, ప‌ది ప‌రీక్ష‌ల‌పై గురువారం జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ఎడ్యుకేష‌న్ మినిస్ట‌ర్ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం కొవిడ్ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటిస్తూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ప‌రీక్షా కేంద్రాల్లో మౌలిక వ‌సతులు క‌ల్పించాల‌ని సూచించారు. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల కోసం 9,07,396 మంది విద్యార్థులు, ప‌ది ప‌రీక్ష‌ల కోసం 5,09,275 మంది విద్యార్థులు హాజ‌ర‌వుతార‌ని పేర్కొన్నారు.

అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు..

ఎండ‌లు అధికంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌తి ప‌రీక్షా కేంద్రం వ‌ద్ద ఆరోగ్య శాఖ సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌తో పాటు మెడిక‌ల్ కిట్ల‌ను అందుబాటులో ఉంచాల‌ని ఆదేశించారు. మంచి నీటి సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేయాల‌ని సూచించారు. విద్యార్థులు స‌కాలంలో ప‌రీక్షా కేంద్రాల‌కు చేరుకునేలా ఆర్టీసీ బ‌స్సులు న‌డిపేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు.

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్ అమ‌లు చేయాల‌ని స‌బితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఎగ్జామ్ సెంట‌ర్ల ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్ షాపుల‌ను కూడా ప‌రీక్షా స‌మ‌యంలో మూసివేయాల‌ని చెప్పారు. ఇక ప‌రీక్షా కేంద్రాల్లో స‌రిప‌డా ఫ‌ర్నిచ‌ర్ ఏర్పాటు చేయాల‌ని, అందుక‌య్యే వ్య‌యాన్ని ప్ర‌భుత్వం స‌మ‌కూరుస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్, పాఠ‌శాల విద్య డైరెక్ట‌ర్ దేవ‌సేన త‌దిత‌రులు పాల్గొన్నారు.