ఎంసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు

నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుల ప్రవేశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్‌ ర్యాంక్‌ల ఆధారంగా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీచేసింది. ఈ జీవోను అనుసరించి బీఎస్సీ నర్సింగ్‌ను ఎంసెట్‌లో చేర్చాలని కోరుతూ కాలోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రికి మంగళవారం లేఖరాశారు.

ఈ లేఖ నేపథ్యంలో తక్షణమే చర్యలు చేపట్టిన ప్రొఫెసర్‌ లింబాద్రి, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌తో మాట్లాడి దరఖాస్తులకు వీలుగా వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా బుధవారం నుంచే దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ప్రస్తుతానికి నాలుగేండ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో ప్రవేశాలను ఇంటర్‌ మార్కుల ఆధారంగా చేపడుతున్నారు.

మెరిట్‌ మార్కులను అనుసరించి సీట్లు కేటాయిస్తున్నారు. తాజా మార్పుతో ఇక నుంచి ఎంసెట్‌ ర్యాంక్‌ల ద్వారానే సీట్ల భర్తీ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ లింబాద్రి మాట్లాడుతూ.. నర్సింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోవు రోజుల్లోను ఇదే తరహాలో సీట్ల భర్తీ ఉంటుందన్నారు.