గెస్ట్ జూనియర్ లెక్చరర్లకు పీఆర్సీ ప్రకారం పీరియడ్ కు 390 వర్తింపజేయాలి

  • జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల 5 నెలల పెండింగ్ వేతనాలు విడుదల
  • అధికారుల మధ్య సమన్వయం లోపం వల్లనే గెస్ట్ లెక్చరర్లకు పీఆర్సీ ఆలస్యం
  • పాత జీతం ప్రకారమే బడ్జెట్ ఇవ్వాలనుకుంటే 6 నెలల జాప్యం ఎందుకు..?
  • ప్రస్తుతం 300 పీరియడ్ ప్రకారం విడుదలైనా వీలైనంత త్వరగా అదనపు బడ్జెట్ విడుదల చేయాలి
  • తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామెర ప్రభాకర్, జనరల్ సెక్రటరీ దార్ల భాస్కర్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1654 గెస్ట్ లెక్చరర్లకు 2021-22 విద్యాసంవత్సరానికి సంబందించిన 5 నెలలకు గానూ (అక్టోబర్ నుండి ఫిబ్రవరి) పీరియడ్ కు 300 చొప్పున (పాత వేతనం) 17,86,32,000 రూపాయల బడ్జెట్ ను ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులను విడుదల చేశారు.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విభాగాల ఉద్యోగులకు 30% పీఆర్సీ వర్తింప చేసిన క్రమంలో, ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా అందరికీ (ఎంటీఎస్, కాంట్రాక్టు, పార్ట్ టైం లెక్చరర్లకు) వర్తించినా..గెస్ట్ లెక్చరర్ల విషయంలో పాత జీతాల ప్రకారమే బడ్జెట్ విడుదల చేయడాన్ని గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు తప్పు పట్టారు. గత సంవత్సరమే ఇంటర్ బోర్డు నుండి పలుమార్లు పీరియడ్ కు 390 ప్రకారం అదనపు బడ్జెట్ కేటాయించాలని ప్రతిపాదనలు పంపినప్పటికీ ఉన్నత విద్యాశాఖ అధికారులు అనేక రకాల కొర్రీలు పెడుతూ..నెలల నెలలుగా ప్రతిపాదనలు తమవద్దే ఉంచుకుని నెలల తరబడి బడ్జెట్ విడుదల చేయడంలో జాప్యం చేశారు. ఆల్రెడీ విడుదలైన బడ్జెట్ ప్రకారమే ఇవ్వాలనుకుంటే 5 నెలలుగా జీతాలను ఆపి గెస్ట్ లెక్చరర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా తేది: 08-02-2022 నాడు ఇంటర్ కమీషనర్ ఒమర్ జలీల్ గెస్ట్ లెక్చరర్లకు పీఆర్సీ ప్రకారం 390 పీరియడ్ కు వర్తింపచేయాలని పంపిన ప్రతిపాదనలను సత్వరమే ఆమోదించి ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా, పీఆర్సీ జీవో ఉత్తర్వుల ప్రకారం మిగిలిన 90 రూపాయల ప్రకారం అదనపు బడ్జెట్, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి పంపి విడుదలయ్యేలా చూడాలని కోరారు.