రెండు రోజుల్లో వయోపరిమితి సడలింపు జీవోలు

  • దశల వారీగా నోటిఫికేషన్స్
  • నోటిఫికేషన్ లకు రోడ్ మ్యాప్

ఎలాంటి న్యాయ వివాదాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో అన్నిశాఖల కార్యదర్శులు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో ఆయన సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో 80 వేలకుపైగా ఉద్యోగాలను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో భర్తీ చేస్తున్నందున, అన్ని శాఖలు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు, బ్యాక్‌ లాగ్‌ పోస్టులు, రోస్టర్‌ పాయింట్లను ఫైనల్‌ చేసి, ఆర్థికశాఖ అనుమతితో ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. వయోపరిమితి సడలింపునకు సంబంధించి కూడా ఒకట్రెండు రోజుల్లోనే జీవోలు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. ఆ వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని సీఎస్‌ ఆదేశించారు.

సమీక్షలో ఏ నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఖాళీ పోస్టులన్నింటికీ ఒకేసారి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, దశలవారీగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ఏ పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఎప్పుడు ఇవ్వాలన్నదానిపై నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలని సీఎస్‌ చెప్పినట్టు తెలిసింది.

Courtesy : ntnews