కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లపై అనుచిత వ్యాఖ్యలు తగదు

  • ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి
  • కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిరసన

మహబూబాబాద్: కొన్ని యేండ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతి తక్కువ జీతంతో పనిచేస్తూ ప్రభుత్వ కళాశాలల ఉన్నతికి పాటు పడుతున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్ల ను అవమానిస్తూ. .కించపరుస్తూ ఒక ఆంగ్ల దినపత్రికలో ఇచ్చిన వ్యాసంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి మధుసూదన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం, గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు మండిపడ్డారు.

శనివారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో డీసీ ప్రతులను చింపి నిరసన వ్యక్తం చేశారు. సంఘాల బాధ్యులు మాట్లాడుతూ..కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లకు ఆంగ్లబోధన రాదని, ఫేక్ సర్టిపికేట్లతో ఎంపికయ్యారని, వీరికి ప్రస్తుతం ఇస్తున్న జీతం కూడా దండగ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతర కరమని, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ అంటూ చెప్పుకునే అతనికి క్షేత్ర స్తాయిలో ఎవరు ఎలాంటి సేవలందిస్తున్నారో తెలియకపోవడం శోచనీయం అన్నారు. బేషరతుగా మధుసూదన్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు తెలియజేయాలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నెలకుర్తి నాగిరెడ్డి, సంఘం నాయకులు పోతరాజు రాజేందర్, ఎండీ షాహిద్, గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, ఆయా సంఘాల నాయకులు సురేందర్, అప్పారావు, బాలరాజు, ఆండాలు, సుశీల, ఆయేషా, సుధాకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.