కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ వెంటనే పూర్తి చేయాలి : దేవేందర్

ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం జారీ చేసిన జిఓ నెంబర్ 16 పై న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన దృష్ట్యా క్రమబద్ధీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం 475 రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగంపల్లి దేవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున కరీంనగర్ పట్టణంలోని సైన్స్ వింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కరీంనగర్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.

కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలపై సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాటి అమలులో అధికారులు చేస్తున్న జాప్యాన్ని విమర్శించారు. కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాల నుండి టీ.డి.ఎస్ రూపంలో వేతనం నుండి విధిస్తున్న కోతను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచిన ఈ విధంగా కాంట్రాక్టు లెక్చరర్లకు పదవి విరమణ వయసు కు సంబంధించిన జీవో వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గరికంటి నరసింహ రాజు, కార్యదర్శిగా గాజిరెడ్డి రాజమహేందర్ రెడ్డి, కోశాధికారిగా ఇల్లెందుల సంపత్ కుమార్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ప్రేమ్ కుమార్ కౌన్సిల్ సభ్యులుగా రాధాకృష్ణ, హరి తదితరులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల, పెద్దపెల్లి జిల్లాల అధ్యక్షులు రేమిడి మల్లారెడ్డి, సునీల్ , హనుమాన్ల శ్రీనివాస్, ఉమాదేవి ,సత్యనారాయణ, ఐలయ్య, కృష్ణప్రసాద్, గోవర్ధన్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.