11 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయాలి – జాతీయ మానవ హక్కుల సంఘం

11 లక్షల ఉపాధ్యాయ పోస్టులను నిర్దేశిత కాల పరిమితితో భర్తీ చేయాలని జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) సభ్యురాలు జ్యోతి క్లారా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

కొవిడ్ మహమ్మారితో పిల్లల అభ్యసన సామర్థ్యాలపై పడిన ప్రభావం.. దాన్ని అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై NHRC వ్యూహ బృందం శుక్రవారం సమావేశమై చర్చించింది.

సమావేశంలో జ్యోతి క్లారా మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు బహు విధ బోధన సామగ్రిని వినియోగించేలా ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ ఇవ్వాలన్నారు. విద్యార్థులు సులువుగా పాఠాలు నేర్చుకునేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాలు అందించాలని, ప్రాథమిక తరగతుల్లో బోధనకు వాలంటీర్లను ప్రోత్సహించాలని సూచించారు.

NHRC సెక్రటరీ జనరల్ బింబధర్ ప్రధాన్ మాట్లాడుతూ.. బోధన విధానంలో మార్పు ఓ వర్గానికి ప్రయోజనకారిగా మారి బలహీనవర్గాలకు దక్కకుండా పోవడం సమాన అవకాశాలని భారతీయ విలువలను దెబ్బతీస్తుందన్నారు. డిజిటల్ బోధన ప్రాథమిక తరగతుల విద్యార్థులపై భిన్న ప్రభావాలను చూపిందన్నారు. విభిన్నమైన సామర్థ్యాలు, విభిన్న వర్గాల నుంచి వచ్చిన పిల్లలకు ఒకే విధమైన బోధనను వీడాలని, ఉపాధ్యాయులు, విద్యార్థుల విభిన్నమైన అవసరాలకు అనుగుణంగా వికేంద్రీకరణతో కూడిన బోధనాభ్యసన ప్రక్రియ,
మూల్యాంకనం దిశగా సాగాలని సమావేశం సిఫార్సు చేసింది.

కొవిడ్ తో పూర్వ ప్రాథమిక విద్య, అంగన్ వాడీలకు వెళ్లడం కోల్పోయినందున నూతన విద్యా సంవత్సరంలో ప్రాథమిక తరగతుల్లో చేరేవారికి ఒకేసారి అక్షరాలు, అంకెలు నేర్పడానికి ముందు కొంత శిక్షణ ఇవ్వాలని, పూర్వ భాషా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాపరమైన అవసరాలను అధిగమించడానికి అవసరమైన గ్రాంట్లను అందించాలని సిఫార్సు చేశారు. అభ్యసన లోపాలను అధిగమించేందుకు దీర్ఘకాలిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

సమావేశంలో NHRC ఛైర్మన్ జస్టిస్ అరుణ్ మిశ్రా, సంయుక్త కార్యదర్శి అనితా సిన్హా, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.డి. ఎస్. త్యాగి, పరిశోధనా అధికారి డాక్టర్ సీ అజం, కేంద్ర విద్యా, మహిళా, శిశు అభివృద్ధి శాఖల అధికారులు, ఎన్‌సీఈఆర్టీ, సీబీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయ సంఘటన, యునిసెఫ్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు.