ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన మన బస్తి – మన బడి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని MLA లు, MLC లు, విద్యా శాఖ అధికారులతో హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి మాట్లాడారు. విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా నాణ్యమైన విద్యను అందించడం, మౌలిక సదుపాయాలు అందించుటకు తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మన బస్తి – మన బడి అనే కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. ఇందుకోసం 7,289.54 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 499 ప్రాథమిక పాఠశాలలు , 9 ప్రాథమికోన్నత పాఠశాలలు , 182 ఉన్నత పాఠశాలలు మొత్తం 690 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. ఆయా పాఠశాలల్లో ఒక లక్ష 25, 700 మంది విద్యార్ధులు ఉన్నారని చెప్పారు.

మన బస్తి – మన బడి కార్యక్రమం లో మొదటి విడతలో 239 పాఠశాలల అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంకు 10 చొప్పున అత్యవసరంగా పనులు చేపట్టవలసిన పాఠశాలలను గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాలలో విద్యార్ధుల కోసం విద్యుత్ సౌకర్యం, తాగునీరు, సరిపడా ఫర్నిచర్, మరుగు దొడ్ల నిర్మాణం వాటిలో నీటి సౌకర్యం కల్పించడం , కాంపౌండ్ వాల్, వంటశాల నిర్మాణం, శిధిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్తవాటి నిర్మాణం వంటి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. డిజిటల్ విద్య అమలు చేయుటకు ఆయా నియోజకవర్గాల MLA లు, MLC ల సహకారంతో ప్రణాళికలు తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. DEO, డిప్యూటీ DEO లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. రానున్న రోజులలో MLA లు, MP లు, ప్రతి ఒక్కరు తమ పిల్లలను పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఆసక్తి కనబరిచే స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేపట్టనున్నట్లు వివరించారు. అనేకచోట్ల ప్రభుత్వ పాఠశాల భవనాలు, తరగతి గదులు విద్యార్దులకు సౌకర్యవంతంగా లేవని, దీంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి ఆ స్థలాలలో పాఠశాల భవనాలు నిర్మించాలని పలువురు MLA లు సమావేశం దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

విద్యార్ధులను విద్యతో పాటు క్రీడలలో కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కానీ కొన్ని పాఠశాలలో విద్యార్ధులకు సరిపడా క్రీడా స్థలాలు లేవని, అందుబాటులో ఉన్న GHMC స్థలాలను క్రీడాస్థలాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పలువురు MLA లు తమ దృష్టికి తీసుకొచ్చారని, వీటిని సోమవారం జరగనున్న మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు. దాని ఫలితంగా విద్యార్దుల హాజరుశాతం పెరగడమే కాకుండా విద్యార్ధులు పలు పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో విద్య ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. దాతలు, కార్పోరేట సంస్థ సహకారం, ప్రవాస భారతీయుల సహకారంతో కూడా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, డీఈఓ రోహిణి, డిప్యూటీ డీఈఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.