అత్యవసర పరిస్థితులు (ఎమర్జెన్సీ) రకాలు – వివరణ

భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రానికి అసాధారణ అధికారాలను ఇచ్చింది. రాజ్యాంగం ప్రభుత్వానికి మూడు రకాలైన అత్యవసర పరిస్థితులు విధించేందుకు అవకాశం కల్పించింది. అవి

  1. జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352)
  2. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356)
  3. ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360)

◆ జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352):

విదేశీ దురాక్రమణ జరిగినపుడు, యుద్ధం సంభవించినపుడు, అంతర్గత సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు దేశంలో అత్యవసర పరిస్థితి విధించాల్సిందిగా ప్రధాని చేసిన సిఫార్సు ప్రకారం రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారు. దీన్ని పార్లమెం టు ఉభయ సభల ముందు ఉంచుతారు. పార్లమెంటు ఆమోదించిన ఈ అత్యవసర పరిస్థితి తీర్మానం వల్ల రాష్ట్రాల – శాసన, కార్యనిర్వాహక అధికారాలన్నీ కేంద్రం అధీనంలోకి వెళతాయి.

రాష్ట్రంలో శాసన సభ రద్దు కాకపోయినా, ప్రభుత్వం సస్పెండ్ కాకపోయినా కేంద్రం రాష్ట్రంపై అధికారం చెలాయించగలదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పరిపాలన నేరుగా కేంద్రం అధీనంలోకి వెళ్లిపోతుంది.

అప్పుడు రాజ్యాంగంలోని 19, 20, 21 అధికరణలు దేశ పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు వాటంతటవే సస్పెండ్ అవుతాయి. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు (1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు మొట్టమొదటిసారిగా దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు.)

◆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన (ప్రకరణ 356):

రాజ్యాంగం విధించిన నియమ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో పరిపాలన సాగడం లేదని, అక్కడి పాలనా యంత్రాంగం విఫలమైందని రాష్ట్రపతి భావించినప్పుడు ఆ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి విధిస్తారు. ఆ సమయంలో ఆ రాష్ట్రంలోని సర్వాధికారాలు (హైకోర్టు మినహా) రాష్ట్రపతి అధీనంలోకి వెళ్లిపోతాయి. ఈ కాలంలో రాష్ట్రానికి అవసరమైన నిధులన్నీ సంఘటిత నిధి నుంచి అందుతాయి. పార్లమెంటు సమావేశాలు లేనపుడు రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలపై ఆర్డినెన్లు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.

◆ ఆర్థిక అత్యవసర పరిస్థితి (ప్రకరణ 360):

దేశ ఆర్థిక పరిస్థితికి ముప్పు వాటిల్లుతుందని రాష్ట్రపతి భావించినపుడు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు రెండు నెలల్లోగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ స్థితిలో రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కేంద్రం అధీనంలోకి వెళ్లిపోతాయి. రాష్ట్ర ఆర్థిక ద్రవ్య బిల్లులు రాష్ట్రపతి ఆదేశాల మేరకే ఆమోదం పొందుతాయి. ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రంలోని ఒక తరగతి వారికి గాని లేదా అందరికి గాని వేతనాల్లో కోత విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది.