కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కేసీఆర్ కు అలుగుబెల్లి లేఖ

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను, అధ్యాపకుల క్రమబద్ధీకరణ మరియు పదవి విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి లేఖ వ్రాశారు.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను, అధ్యాపకులను క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీ మేరకు జి.ఓ.నెం. 16, తేది. 26.02.2016న జారీ చేసిన విషయం మీకు తెలిసిందే. కానీ, హైకోర్టు పిల్ 122/2017 నాధారంగా మధ్యంతర ఉత్తర్వులిచ్చి క్రమబద్దీకరణ ప్రక్రియను ఆనాడు తాత్కాలికంగా నిలిపివేసింది. హైకోర్టు ఇచ్చిన అట్టి మధ్యంతర ఉత్తర్వులు తేది. 07.12.2021న రద్దు చేసింది. కావున తమరు పరిశీలించి, రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను జి.ఓ. 16 ప్రకారం క్రమబద్దీకరించుటకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాను.

అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు అధ్యాపకులు సుమారు రెండు దశాబ్దాల నుండి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. దీర్ఘకాలంగా పనిచేస్తూ ఎంతో అనుభవం వుండి, అతితక్కువ వేతనాలతో ఇప్పటికే పదవీ విరమణ వయస్సు దగ్గరపడుతున్నవారున్నారు. కావున రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచినట్లుగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచి, అమలు చేయాలని కోరుతున్నట్లు లేఖలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు.