రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు 70-75 వేలు?

  • ఐఏఎస్‌ల కమిటీ ప్రాథమిక అంచనా
  • తొలుత సీఎస్‌, తర్వాత సీఎంకు నివేదిక.. త్వరలో నోటిఫికేషన్‌ జారీకి అవకాశం!
  • అసెంబ్లీ సెషన్స్‌ ప్రారంభానికి ముందే!.. కేసీఆర్‌ జన్మదిన బహుమతిగా ప్రకటిస్తారని చర్చ
  • నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులు కేటాయించే అవకాశం!

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 70-75 వేల వరకు ఉద్యోగ ఖాళీలున్నాయని ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ప్రభుత్వం నియమించిన నలుగురు ఐఏఎ్‌సల కమిటీ.. తీవ్ర కసరత్తు చేసి, వీటిని గుర్తించినట్లు తెలిసింది. ఇప్పటికైతే ఈ వివరాలను ప్రభుత్వానికి అందజేసి, అడ్డంకులను అధిగమించిన తర్వాత సమగ్ర వివరాలతో తుది నివేదిక రూపొందిస్తుందని సమాచారం. కేంద్ర ప్రభుత్వం 17 లక్షల ఖాళీలను భర్తీ చేయడం లేదంటూ సీఎం ఆరోపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఖాళీలపై ఐఏఎస్‌ల కమిటీపై ఒత్తిడి పెరిగింది. పైగా అసెంబ్లీ సమావేశాలు దగ్గరపడుతున్నాయి. నిరుద్యోగుల ఆందోళనలు అధికమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కమిటీ తాత్కాలిక నివేదికను రూపొందించినట్లు తెలిసింది. ఇందులో.. ఎలాంటి శాఖాపరమైన, ఆర్థిక, న్యాయపరమైన చిక్కులు లేని ఉద్యోగాలను గుర్తించి ఒకటి, రెండు నోటిఫికేషన్లు జారీ చేస్తారని సమాచారం. మరోవైపు నెలాఖరులోగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభిస్తామని సీఎం ఆదివారం మీడియాకు చెప్పారు. దీనికిముందుగా ఒక్క నోటిఫికేషనైనా వెలువడవచ్చని తెలుస్తోంది. అయితే, ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా.. నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్న చర్చ జరుగుతోంది. కాగా, ఖాళీలను భర్తీ చేయడం ద్వారా పడే ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకుని 2022-23 బడ్జెట్‌లో ఎంతో కొంత నిధులను ప్రత్యేకిస్తారని తెలుస్తోంది. అందుకే సమావేశాలకు ముందుగా ఒకటో, రెండో నోటిఫికేషన్లు వెలువడతాయన్న చర్చ జరుగుతోంది.

★ సీఎం ఆదేశించిన ఆరు నెలలకు

ఖాళీలను గుర్తించాలన్న మాట ఇప్పటిది కాదు. గత ఏడాది జూలై 13న జరిగిన మంత్రివర్గ సమావేశానికి ఖాళీల వివరాలు సమర్పించాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రంలో 56,979 ఖాళీలున్నట్లు అధికారులు నివేదిక సమర్పించారు. కానీ, దానిపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగాల భర్తీ అంశాన్నీ తేల్చలేదు. మరింతగా వివరాలు సేకరించాలని, ఖాళీల భర్తీకి జాబ్‌ కేలండర్‌ను రూపొందించాలని మంత్రివర్గం ఆదేశించింది. దాంతో ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల అధికారులు తీవ్ర కసరత్తు చేసి 67,128 ఖాళీలను గుర్తించారు.

దీనిపై కూడా ప్రభుత్వం ఏమీ తేల్చలేదు. ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాళీలను సమగ్రంగా తేలుస్తామని, తర్వాత భర్తీ ప్రక్రియ చేపడతామంటూ ప్రగతిభవన్‌లో తనను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం వెల్లడించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రంలోని 70-80 వేల ఖాళీలను భర్తీ చేస్తామంటూ కేసీఆర్‌ ప్రకటించారు.

★ 15లోగా నివేదించాలన్న సీఎస్‌..

ఈ పరిస్థితుల్లో జనవరి నెలలో నలుగురు ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కమిషనర్‌ వి.శేషాద్రి చైర్మన్‌గా, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, మహిళా శిశు సంక్షేమ కమిషనర్‌ దివ్య ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగుల సర్దుబాటుతో ఆయా జిల్లాల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా, నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన నివేదిక సమర్పించాలని ఈ కమిటీకి సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. మరోవైపు ఇటీవల సమీక్ష సమావేశంలో ఈ నెల 15లోగా ఖాళీల వివరాలను అందించాలంటూ సీఎస్‌ కూడా ఐఏఎ్‌సల కమిటీని ఆదేశించారు. దీంతో 70-75 వేల వరకు ఖాళీలను తాత్కాలికంగా గుర్తించినట్లు తెలిసింది. ఉద్యోగుల సర్వీసు, రిటైర్మెంట్‌ గడువు, పదోన్నతులు తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని వివరాలను కూర్చినట్లు సమాచారం.

★ 5 వేల పోస్టులు అవసరమన్న పురపాలక శాఖ

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 61 మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటితో కలుపుకొని మొత్తం 147 మున్సిపాలిటీలు,  కార్పొరేషన్లలో దాదాపు 5 వేల కొత్త పోస్టులు అవసరమంటూ ఐఏఎస్ కమిటీకి పురపాలక శాఖ నివేదించినట్లు తెలిసింది. తమ శాఖలో కూడా భారీగా ఖాళీలున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. 5 వేలపైగా ఉన్న విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్‌వో)లను పంచాయతీరాజ్‌ తదితర శాఖల్లో విలీనం చేయబోతున్నారు. ఇలాంటి వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రాథమికంగా ఖాళీలను తేల్చినట్లు సమాచారం. ఈ నివేదికను అతి త్వరలో సీఎస్ కు కమిటీ అందించనుంది. ఆయన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమర్పిస్తారు. వీటిని పరిశీలించి, నోటిఫికేషన్‌ జారీకి సీఎం నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

Source & Credits : Andhra Jyothi