ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సిందే : హైకోర్టు

తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఫిబ్రవరి 28 వరకు భౌతిక తరగతులతో పాటు ఆన్లైన్ బోధన కూడా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ. న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాపై దాఖలైన పలు వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను గురువారం ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ఈ విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు హాజరయ్యారు. కరోనా తీవ్రత ఎక్కువగా లేనందునే విద్యా సంస్థలను తెరిచామని, విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని విద్యాసంవత్సరం నష్టపోకుండా చర్యలు తీసుకున్నామంటూ విద్యాశాఖ విడిగా నివేదిక అందజేసింది. పిల్లలకు కరోనా చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసినట్లు శ్రీనివాసరావు వివరించారు.

కాగా ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను ఈ నెల 28న జరిగే విచారణ నాటికి అందించాలని ధర్మాసనం ఆదేశించింది.