విద్యా సంస్థల ప్రారంభం పై నిర్ణయం తీసుకోలేదు – హైకోర్టుకు ప్రభుత్వం సమాధానం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు వారాంతపు సంతల్లో కొవిడ్ నియంత్రణకు చర్యల గురించి, పాఠశాలల పునఃప్రారంభం పై వివరాలు తెలపాలని.. ఈనెల 31 నుంచి తెరుస్తారా లేదా అని, అలాగే సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కోరింది.

ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ విద్యా సంస్థల పునఃప్రారంభం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు.

ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 71లక్షల ఇళ్లలో ఫీవర్ సర్వే చేపట్టి 3.45 లక్షల కిట్లు అందజేశామని వివరించారు. కిట్లలో పిల్లల చికిత్సకు సంబంధించిన ఔషధాలు లేవని న్యాయవాదులు ప్రస్తావించగా.. వారి మందులను కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదని డీహెచ్ అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.