ఇంటర్ పరీక్షలలో మరింత పెరగనున్న చాయిస్

తెలంగాణ ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు – 2022లో చాయిస్‌ ప్రశ్నలు మరిన్ని పెరగనున్నాయి. గత ఏడాది సాధారణంగా ఇచ్చే చాయిస్‌ ప్రశ్నల కన్నా ఎక్కువ ప్రశ్నలు ఇచ్చిన బోర్డు.. ఈ ఏడాది ఆ సంఖ్యను మరింత పెంచుతున్నట్లు, అన్ని విభాగాల ప్రశ్నల్లోనూ చాయిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు సమాచారం.

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు సులువుగా ఉత్తీర్ణులయ్యేలా సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ వార్షిక పరీక్షలను ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇంటర్‌లో సైన్స్‌ సబ్జెక్టుల ప్రశ్నపత్రంలో సాధారణంగా మొత్తం 60 మార్కులకుగాను, 76 మార్కుల ప్రశ్నలను ఇస్తారు. ఇందులో 2 మార్కుల ప్రశ్నలు 10 ఉంటాయి. వీటిలో చాయిస్‌ లేకుండా అన్నింటినీ రాయాల్సి ఉంటుంది. ఇక 4 మార్కుల ప్రశ్నలను 8 ఇస్తారు. వీటిలో 6 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఆ తరువాత 8 మార్కుల విభాగంలో 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో రెండింటికి సమాధానం రాయాల్సి ఉంటుంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో తరగతులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో 4 మార్కుల విభాగంలో 8 ప్రశ్నలకు బదులు 12 ప్రశ్నలు ఇచ్చి.. వాటిలో ఆరింటికి సమాధానం రాసే అవకాశం కల్పించారు. అలాగే 8 మార్కుల ప్రశ్నలు మూడింటికి బదులు నాలుగు ఇచ్చి.. రెండు ప్రశ్నలకు సమాధానం రాయాల్సిందిగా సూచించారు. మొత్తంగా 60 మార్కులకుగాను 100 మార్కుల ప్రశ్నలు ఇచ్చారు. ఈ ఏడాది ప్రశ్నల చాయి్‌సను మరింత పెంచారు. గతంలో చాయిస్‌ ఆప్షన్‌ లేని 2 మార్కుల విభాగంలోనూ ఈ అవకాశం కల్పిస్తున్నారు. 10 ప్రశ్నలకు బదులుగా మరో 5 ప్రశ్నలను అదనంగా చేర్చి.. తిరిగి పది ప్రశ్నలకే సమాధానం రాయాలని సూచించనున్నారు. అలాగే 4 మార్కుల విభాగంలోనూ మరో రెండు ప్రశ్నలు పెంచి 14 ప్రశ్నలు ఇవ్వనున్నారు. మొత్తమ్మీద 118 మార్కుల ప్రశ్నల్లో 60 మార్కుల ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాయాల్సి ఉటుంది.

ఇదే నిష్పత్తిలో లాంగ్వేజీలు, ఆర్ట్స్‌ సబ్జెక్టుల ప్రశ్న పత్రాల్లోనూ చాయిస్‌ ప్రశ్నలను పెంచారు. ఈ నిర్ణయం ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకూ వర్తించనుంది. చాయిస్‌ ప్రశ్నల సంఖ్యను పెంచడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

source : abn