పెండింగ్ డీఏలు విడుదలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు పెండింగులో ఉన్న మూడు డీఏల (10.01 శాతం) మంజూరుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మేరకు చెల్లింపులకు అనుమతించినట్లు మంగళవారం ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.

దీనివల్ల ప్రభుత్వంపై నెలనెలా రూ.260 కోట్ల అదనపు భారం పడుతుంది. పెరిగిన డీఏను ఫిబ్రవరి వేతనం/ఫించనుతో కలిపి చెల్లించే అవకాశం ఉంది.

2020 జనవరి డీఏ 3.64 శాతం, అదే సంవత్సరం జూలై డీఏ 2. 73 శాతం, 2021 జనవరి డీఏ 3.64 శాతం- మొత్తంగా 10.01 శాతాన్ని వేతనంతో కలిపి ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఇదిగాక జులై 2021 నాటికి చెల్లించాల్సిన 2.73 శాతం డీఏ పెండింగులో ఉంది. ఈ నెల పూర్తయ్యే నాటికి మరో డీఏను ప్రభుత్వం మంజూరు చేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.