కాంట్రాక్టు ఉద్యోగులు & లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని మంత్రి పువ్వాడకి వినతి.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు/ లెక్చరర్ల ను క్రమబద్ధీకరించాలని ఈరోజు ఖమ్మంలో రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కి వినతిపత్రం ఇచ్చినట్లు జీవో నెంబర్ 16 క్రమబద్ధీకరణ అమలు సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఖమ్మం జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మరియు జిల్లా ఇంటర్ విద్య గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి పువ్వాడ అజయ్ ని కలిసి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం కోసం 2016లో ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 16 ఇవ్వడం జరిగిందని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వలన గత నాలుగు సంవత్సరాలుగా క్రమబద్ధీకరణ జరగలేదని తాజాగా హైకోర్టు కాంట్రాక్టు ఉద్యోగులు కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంట్రాక్టు ఉద్యోగుల, లెక్చరర్ ల క్రమబద్ధీకరణ అంశం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చినట్లు కన్వీనర్ డా. కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో 475 సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు వివిధ సంఘాల నేతలు భాస్కర్, మల్లయ్య, సత్యనారాయణ, బిక్షపతి, సతీష్ రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.